తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో "సూర్య". గజిని సినిమా ద్వారా తెలుగు వాళ్ళకి పరిచయమై అప్పటి నుండి ప్రతీ సినిమాతో తెలుగు వాళ్ళని పలకరిస్తున్నాడు.  మొన్న వచ్చిన ఎన్ జి కె ఘోర పరాజయం తర్వాత "బందోబస్త్" చిత్రంతో మన ముందుకొస్తున్నాడు.తమిళ సినిమా 'కప్పాన్'కు తెలుగు అనువాదంగా వస్తున్న ఈ చిత్రానికి రంగం ఫేమ్ "కె. వి ఆనంద్ " దర్శకత్వం వహించారు.


సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు.'బందోబస్త్' తమిళ వెర్షన్ 'కప్పాన్' పాటలు ఇటీవలే సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల అయ్యాయి. హేరీశ్ జైరాజ్ స్వరపరిచిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. త్వరలో తెలుగు వెర్షన్ పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


సోనీ మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు.ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ గెటప్పుల్లో సూర్య నటన, పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, కథా నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను టీజర్ మరింత పెంచింది.

 ఈ సినిమాలో  సూర్య, మోహన్ లాల్ తో పాటు ఆర్య, బొమన్ ఇరానీ, సముద్ర ఖని,  నాగినీడు తదితరులు నటించారు. నవాబ్,  2.O లాంటి విజువల్ వండర్ చిత్రాలను నిర్మించిన లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత సుభాస్కరణ్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20 న విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. సూర్య నటించిన గజిని సినిమా కూడా సెప్టెంబరులోనే విడుదల కావడం విశేషం. మరి గజిని లాంటి హిట్ సాధిస్తుందా లేదా చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: