చిరంజీవి నలభై ఏళ్ల నట ప్రస్థానంలో అధిరోహించని శిఖరం లేదు. ఈ ప్రయాణంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన వారెందరో ఉన్నారు. కెరీర్ మొదట్లో సినిమాల్లో దెబ్బలు తగిలేలా ఫైట్లు, ఒళ్లు నొప్పులు పుట్టేలా డ్యాన్సులు చేసి ఇంటికి వచ్చి ఇబ్బందిపడుతుంటే.. తండ్రి వెంకట్రావు, తల్లి అంజనాదేవి కాళ్లు పట్టడం, ఒళ్లుపట్టడం చేసేవారని చిరంజీవి చెప్పారు. భార్య సురేఖ ఆయన జాగ్రత్తలు, పిల్లల వ్యవహారాలు, చదువులు చూసుకునేవారు. 



చిరంజీవి కెరీర్లో అల్లు అరవింద్ పాత్రను తక్కువ చేసి చూడలేం. చిరంజీవి వరుస షూటింగులతో బిజీగా ఉంటే ఆర్ధిక లావాదేవీలు, ఇంటికి సంబంధించిన పనులు, పిల్లల చదువులు అన్నీఅరవింద్ చూసుకునేవారు. ”చిరంజీవి బిజీగా ఉండడంతో నేను ఆర్ధిక వ్యవహారాలు, ఇంటి పనులు చూసుకునేవాడిని.. అంతకుమించి నేను చిరంజీవికి చేసిందేమీ లేదు”అని అల్లు అరవింద్ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఆయన ఫిట్ నెస్, సినిమాలకు సంబంధించి కేర్ తీసుకునే మరో తరం వచ్చింది. తనయుడు రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. హీరోగా తానెంత బిజీగా ఉన్నా ఖైదీ నెం.150 ప్రొడ్యూస్ చేయడమే కాకుండా, సైరా నిర్మాణం, ప్రమోషన్లు, తర్వాత చేయబోయే సినిమా బాధ్యతలు, అన్నీ చూసుకుంటున్నాడు. కోడలు ఉపాసన చిరంజీవి ఫిట్ నెస్, హెల్త్ కేర్ చూసుకుంటోంది. తాజాగా తన మానసపుత్రిక బీ-పాజిటివ్ మ్యాగజైన్ లో చిరంజీవి కవర్ పేజీలో చూపించి హెల్త్ కి సంబంధించిన విషయాలు వివరిస్తోంది. 



చిరంజీవి సంపాదించుకున్న ఆస్తి ఆయన అభిమానులే. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంలో వారి పాత్ర కీలకం. చిరంజీవి వేసిన ప్రతి అడుగులో వెన్నంటి ఉంటూ ఆయనను ప్రోత్సహించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆయన కుటుంబం నుంచి అభిమానుల నుంచి దక్కిన సహకారం.. మరెవరికీ దక్కని అదృష్టమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: