బిగ్ బాస్ సీజన్ త్రీ లో ఎంతగానో అలరిస్తున్న 'వితికా షేరు' అక్షరాల ఆంధ్రా అమ్మాయి. అది కూడా భీమవరం బుల్లెమ్మ 1993 లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వితిక జన్మించింది. ఆపై చదువంతా హైదరాబాద్, ముంబై లోని సాగింది. బాలనటి గా కెరీర్ మొదలు పెట్టి ఇటు బుల్లి తెరపై, అటు వెండితెర పై రాణించి తెలుగు చిత్రాలతో పాటు అటు కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా తనదైన బాణీ చూపిస్తున్న ఈ అందాల రాణి ఇప్పుడు బిగ్ బాస్ లో అందరి మనసు దోచుకుంటుంది. ఆమె రియల్ స్టోరీలో తెలుగు సినిమా స్టోరీలా ఎన్నెన్నో మెలికలతో మరెన్నో మలుపులతో సాగుతుంది. చిన్నప్పట్నుంచి వితికకు నటనంటే ప్రాణం. 11 ఏళ్ల వయసులోనే టీవీలో బాలనటిగా రంగ ప్రవేశం చేసింది.ఎన్నో తెలుగు సీరియల్స్ లో కూడా నటించింది.



హైదరాబాదులోని లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కళాశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఒక పక్క చదువుతూనే మరో పక్క నటనపై అభిరుచి పెంచుకుంటూ సినీ విభాగంలో హెయిర్ స్టైలిస్ట్ తో కలిసి షూటింగ్ కి వెళ్ళింది. ఆమెను చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు ఒక అవకాశం కల్పించారు. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" అనే తెలుగు సినిమా కన్నడ రీమేక్ లో స్వాతిరెడ్డి చేసిన పాత్రను విజయవంతంగా పోషించి మంచి పేరు తెచ్చుకుంది. కన్నడ రంగంలో బోణీ కొట్టి మళ్లీ తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వితికను సినిమా రంగానికి పరిచయం చేసిన తొలి చిత్రం "అంతు వింతూ ప్రీతి వంతు" అనే కన్నడ సినిమా దానికి వచ్చిన గుర్తింపుతో తెలుగులో సూపర్ హిట్టయిన "ఉల్లాసంగా ఉత్సాహంగా" చిత్రం కన్నడ రీమేక్ లో తనదైన రీతిలో ఇరగదీసింది.



కన్నడలో ఒక రేంజ్ కు వచ్చిన తరువాత తెలుగులో చిన్నా చితకా బడ్జెట్ సినిమాలతో పేరు తెచ్చుకుంది."ఝుమ్మంది నాదం, భీమిలి" చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అటుపై "ప్రేమ, ఇష్క్, కాదల్" సినిమాల్లో తన విశ్వరూపం చూపించి అక్కడితో ఆగకుండా తమిళంకి వెళ్లి "నియర్ మేజి" అనే తమిళ చిత్రంలో అంధురాలిగా ఒక ఆఫ్ బీట్ పాత్రను పోషించింది. అందుకోసం బ్రెయిలీ లిపి కూడా నేర్చుకుంది. ఆ సినిమాకి ఎంతో గుర్తింపు వచ్చింది. 2012 లో "పడ్డానండి ప్రేమలో" ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన తొలిసారి నటించింది. వాళ్ళ ప్రేమ కూడా అక్కడే చిగురించింది. మొదటి మూడు నెలలు వాళ్ళు ఏమీ పెద్దగా మాట్లాడుకోకపోయినా ఆ తర్వాత మాత్రం సినిమా ఆఖరి షెడ్యూల్ మలేషియాలో జరిగినప్పుడు ఇద్దరూ ఒక్కటయ్యారు.



అప్పుడే వారి పెళ్లి కూడా జరిగింది. వారి ప్రేమ పెళ్లి కూడా పెద్దల ఆశీస్సులతో విజయవంతంగా జరగడం విశేషం. చివరగా మహాబలిపురం అనే తమిళ చిత్రంలో నటించి కుటుంబ జీవితానికి అంకితమైంది. పెళ్లి తర్వాత దాదాపు కుటుంబానికి ఆమె పరిమితమైపోయింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ భర్తతో కలిసి ఇలా బిగ్ బాస్ సీజన్ త్రి లో ప్రేక్షకుల మనసు దోచుకుంది వితిక. మొగుడు, పెళ్లాలు ఇద్దరూ ఈ షో లో ఒకరిని మించి ఒకరు అలరిస్తున్నారు. ఆమె రియల్ స్టోరీ ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటూ సాగుతూ వచ్చింది. పదకొండేళ్లకే బాలనటిగా, అటుపై పదిహేనేళ్లకే కన్నడ రంగంలో నటిగా, ఆ తర్వాత తెలుగు రంగంలో హీరోయిన్ గా తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్న వితిక ఇప్పుడు బిగ్ బాస్ లో తన అభిమానులను అలరిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: