మహాలక్ష్మీ అనుగ్రహం కోసం మహిళలు ప్రత్యేకంగా పూజలు చేసే శ్రావణమాసం సకల శుభాలను కలిగిస్తుందని మన భావన.  శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కనుక శ్రావణ మాసంగా ఈ మాసాన్ని పిలుస్తారు. ఈ మాసంలో వచ్చే శుక్రు వారాలతో పాటు సోమవారం మంగళవారాలకు కూడా చాల ప్రాముఖ్యత ఉంది.
శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు చేసే శివారాదనకు మంచి పట్టు ఉండటమే కాకుండా ఆరోజు శివుడుని ఆరాదిస్తే అన్ని  కోరికలు తీరుతాయి అని అంటారు. ఈ శ్రావణ మాసంలో సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివారాదన చేస్తాడట. అందువలన ఈ మాసంలో శివుడుని ఆరాదించే వారికి శివానుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లబిస్తుంది.

శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతం జరుపుకుంటారు. కాలం మారుతున్నా మనుషులలో శాస్త్రీయ దృక్పదం పూర్తిగా పెరిగిపోయినా స్త్రీలు పురుషులతో సమానంగా అనేక రంగాలలో ముందడుగు వేస్తున్నా ఈ శ్రావణ మాసంలో చాలమంది స్త్రీలు సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేయడం తరతరాల నుండి కొనసాగుతూనే ఉంది.  చాలామంది ఇళ్లలో కొత్త పెళ్లి కూతుళ్లతో నోములు చేయిస్తుంటారు అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని ఏ ఇంట్లో కంటతడి పెట్టకుండా చుసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అభిప్రాయం ఉంది. 

లక్ష్మీ అనగానే చాలామంది డబ్బు మాత్రమే అనుకుంటారు. డబ్బుతో పాటు ధైర్యము విద్య విజయం  కీర్తి సంతానము గుణము ఇవన్నీ కూడా లక్ష్మి గానే భావిస్తాం. అందుకే అష్టలక్ష్మిలు ప్రతి ఇంట కొలువై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇల్లు లక్ష్మీదేవి పూజలతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రత కథలో చారుమతి అనే స్త్రీ అందరితో అణకువగా ఉంటుందని అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలిగిందని చెబుతారు. అంతేకాదు ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో సిరిసంపదలు తులతూగుతూ ఉంటాయని మన పెద్దలు చెపుతారు. 

ఉత్తరాయణం దక్షిణాయనానికి మధ్యస్థంగా శ్రావణ మాసం వస్తుంది. వరలక్ష్మీ వ్రతంలో సకల శుభాలను కలగజేయడమే కాకుండా శాస్త్రీయంగా ఇంటికి వంటికి సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడే శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతానికి తొమ్మిది రకాల పుష్పాలు పిండివంటలు పత్రి పండ్లను ఉపయోగిస్తారు. వీటివల్ల ఎన్నో ఉపయోగాలతో పాటు వీటి వెనుక ఆరోగ్య రహస్యాలు కూడ ఉన్నాయి.  వరలక్ష్మీ పూజ తరువాత ఆ తల్లికి నైవేద్యంగా పూర్ణం బూరెలు పులగం గారెలు పరమాన్నం చక్కెరపొంగలి పులిహోర తయారు చేస్తారు. ఇక వరలక్ష్మి వ్రతం రోజున మొగలిపువ్వు తామరపువ్వులతో అమ్మవారిని పూజిస్తారు. 

వరలక్ష్మీ వ్రతంలో ప్రధానంగా తొమ్మిది రకాల పండ్లను నైవేద్యంగా పెడతారు. వీటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈరోజు మహిళలు తాము చేసే పూజలో ఎంతోకొంత అమ్మను బంగారంతో అలంకరిస్తారు. మహిళలలో చైతన్యం తీసుకు వచ్చి అందర్నీ ఒకటిగా చేర్చే శ్రావణమాస పేరంటాలలో ఆర్ధిక తారతమ్యాలు లేకుండా అందర్నీ సమదృష్టితో చూడాలని అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ సిద్దిస్తుంది అన్న సామాజిక కోణం దాగి ఉంది. ఈరోజున ‘వరలక్ష్మి దేవి’ వ్రతం చేసుకునే మహిళలు అందరికి సకల శుభాలు కలగాలని ఇండియన్ హెరాల్డ్ మనస్పూర్తిగా ఆకాంక్షిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: