నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన మన్మథుడు2 సినిమా ఈరోజు విడుదలైంది. 2002 సంవత్సరంలో నాగార్జున, సోనాలి బింద్రే కాంబినేషన్లో వచ్చిన మన్మథుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాకు సీక్వెల్ కాకపోయినప్పటికీ అదే పేరుతో తీస్తున్న సినిమా కావటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. 
 
ప్రేమలో ఫెయిల్ కావడంతో సామ్(నాగార్జున) పెళ్ళికి దూరంగా ఉంటూ ప్లే బాయ్ లాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోమని ఫోర్స్ చేయటంతో ఒక హోటల్ లో పని చేసే అవంతిక(రకుల్ ప్రీత్ సింగ్) ను తన గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేస్తాడు. అలా పరిచయం చేసిన తరువాత ఏం జరిగింది అనే కథాంశంతో మన్మథుడు2 సినిమాను రూపొందించారు. 
 
కథ పరంగా మన్మథుడు, మన్మథుడు2 సినిమాలకు పోలికలు లేనప్పటికీ మన్మథుడు2 సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పించే విధంగానే ఉంది. నాగార్జున వయస్సుకు తగిన పాత్రలో నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో అలరించిన మన్మథుడు2 సెకండాఫ్ కొంచెం స్లోగా ఉంది. 
 
నాగార్జున, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మైనస్ గా మారాయి. చి ల సౌ సినిమాతో హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ రెండో సినిమా కూడా హిట్ కొట్టినట్లే. వరుసగా సెలవులు ఉండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సాహో సినిమా రిలీజ్ అయ్యేదాకా మరో భారీ సినిమా ఏదీ లేకపోవటం మన్మథుడు2 సినిమాకు కలిసొచ్చే అంశం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: