అందరు జాతీయ అవార్డుల ప్రకటన ఎప్పుడు వస్తుందా?.. అంటూ గత కొన్ని రోజులుగా మన ఇండస్ట్రీలో ఆసక్తిగా చర్చ సాగింది. అందుకే 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని ఢీల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల సినిమాలకు అవార్డుల విజేతల్ని ప్రకటించారు. కేంద్రం సమాచార - ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ .. జూరీ సభ్యుడు రాహుల్ రాలీతో కలిసి ఈ పురస్కారాల వివరాల్ని వెల్లడించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మహానటి.. రంగస్థలం.. అ!.. చి.ల.సౌ సినిమాలకు అవార్డులు దక్కడం అందరికి సంతోషాన్ని కలిగించింది.. గత కొన్ని ఏళ్ళతో పోలిస్తే ఈ సారీ తెలుగు సినిమా జాతీయ పురస్కారాల్లో వికసించిందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక మన టాలీవుడ్ లో తెలుగు సినిమా అవార్డుల వివరాల్ని పరిశీలిస్తే.. మొత్తం ఏడు అవార్డులు టాలీవుడ్ గెలుచుకుంది. ఇందులో మూడు మహానటికి దక్కడం ఆసక్తికరమైన విషయం.

మహానటికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారం దక్కింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులతో పాటు విమర్షకుల ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కింది. అలాగే మహానటి కి ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ పురస్కారమూ దక్కింది. ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రంగా సుశాంత్- రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో వచ్చీన సినిమా 'చి.ల.సౌ' అవార్డును దక్కించుకోవడం ఆసక్తికరం. 

అంతేకాదు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో  ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అ! చిత్రానికి .. కన్నడ కేజీఎఫ్ కి కలిపి అవార్డును పంచారు. ఉత్తమ మేకప్ విభాగంలోనూ అ! చిత్రం అవార్డ్ ను దక్కించుకుంది. ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో రంగస్థలం (రాజా కృష్ణన్) చిత్రానికి పురస్కారం దక్కింది. ఇక సౌత్ నుంచి కన్నడ సినిమా కేజీఎఫ్ కి అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రంగా కేజీఎఫ్ పురస్కారం దక్కించుకుంది. అలాగే అందరు ముందుగా ఊహించినట్టే బాలీవుడ్ లో తెరకెక్కించిన యూరి.. అంధాదున్.. పద్మావత్ సినిమాలకు జాతీయ పురస్కారాలు దక్కాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: