తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు తరువాత ఆ స్థానంలో యావత్ ప్రపంచం అభిమానించదగ్గ గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి. చెన్నై లోని దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. అయితే ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. ఈ సినిమా తర్వాత చిరు మన వూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు. అయితే ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక నటకిరీటిగా పేరు సంపాదించిన హీరో రాజేంద్ర ప్రసాద్ మెగాస్టార్ కి సీనియర్ అన్న విషయం చాలా తక్కువమందికే తెలుసు.

ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో నటించడం ప్రారంభించారు. నటుడిగా రాజేంద్రప్రసాద్ మొదటి సినిమా బాపుగారి దర్శకత్వంలో రూపొందిన స్నేహం. ఈ సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మెగాస్టార్ కంటే ముందే రాజేంద్రప్రసాద్ దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరారు. ఆ తర్వాత మెగాస్టార్ కూడా ఇదే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేశారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే దేవదాస్ కనకాల గారి సతీమణి కి ఈ ఇద్దరు అంటే ఎంతో ఇష్టం. ఇక సినిమా ప్రయాణం కూడా రాజేంద్రప్రసాద్..మెగాస్టార్ కంటే సంవత్సరం ముందే ప్రారంభించారు. ఈ రెండు విషయాలలో రాజేంద్రప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి కంటే సీనియర్. అయితే వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం కూడా బయట ప్రేక్షకులకు అంతగా తెలీదు. ఆ రోజు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో మొదలైన వీళ్ళ పరిచయం మంచి స్నేహితులుగా ఈ రోజుకి కొనసాగుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: