టాలీవుడ్ సినిమా నటుల్లో కొందరి గురించి చెప్పడానికి ఎంత సమయం అయినా సరిపోదు, ఎందుకంటే వారు సాధించిన ఘనత అంత గొప్పది. ఆ విధంగా తెలుగు సినిమా రంగంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , కమెడియన్ గా, పలురకాల పాజిటివ్ మరియు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో నటించి, అలానే నటించిన ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసే దిగ్గజ నటులు పద్మశ్రీ కోటశ్రీనివాస రావు గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తెలుగు సినిమా చరిత్రలో ఒకప్పుడు, ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించగల సత్యనారాయణ గారి మాదిరిగా, ఆ తరువాతి తరానికి కోట శ్రీనివాసరావు గారు కూడా పలు పత్రాలు పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. నిజానికి కోట మొదట సినిమాల్లో చాలా చిన్నపాటి పాత్రల్లో నటిస్తూ వచ్చారు. మొదట చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న పాత్రలో నటించిన కోట, ఆ తరువాత ప్రతిఘటన, బాబాయి అబ్బాయి, రేపటి పౌరులు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి మెల్లగా అవకాశాలు పెంచుకుంటూ వెళ్లారు. అయితే ఆ తరువాత అప్పటి ప్రఖ్యాత హాస్య దర్శకుడు జంధ్యాల, కోటలోని హాస్య చతురతను గమనించి, తాను తీయబోయే అహనా పెళ్ళంట సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన లక్ష్మీపతి పాత్రను ఆయనకు ఇవ్వడం జరిగింది.

ఇక ఆ పాత్రలో ఎంతో అద్భుతంగా కోట నటించారు అనే కంటే, జీవించారు అని చెప్పవచ్చు. అంతేకాక ఆ సినిమాకు వచ్చినవారు ఒక్కసారైనా నవ్వకుండా ఇంటికి వెళ్లగలిగితే, అటువంటి వారికి బహుమతులు కూడా ఇస్తాం అని అహనా పెళ్ళంట సినిమా యూనిట్ అప్పట్లో ఒక ప్రకటన కూడా గుప్పించిందట. ఆ విధంగా ఆ సినిమా అనుకున్న దానికంటే అత్యద్భుతమైన విజయాన్ని అందుకుని కోట గారికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఇక ఆపై జంధ్యాల గారు సహా దాదాపుగా అందరు దర్శకులు మరియు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన కోట గారు, ఇప్పటివరకు దాదాపుగా ఆరు వందల యాభైకి పైచిలుకు సినిమాల్లో నటించారు. ఇక చిన్నప్పటినుండి సినిమాల పట్ల మంచి ఆసక్తి గల కోట గారు, తన తండ్రి వలె డాక్టర్ అవుదాం అనుకున్నారట. కానీ నటుడు అవ్వాలనే కాంక్షతో ఆయన డాక్టర్ కాలేకపోయారు. ఇక చదువులో బిఎస్సి పట్టా పుచ్చుకున్న కోట గారు, ఆ తరువాత స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో కొన్నాళ్లు ఉద్యోగిగా కూడా పని చేసారు. అయితే అప్పటికీ మనసు అంగీకరించకపోవడంతో మెల్లగా నాటకాలు వేయడం ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ చేరుకొని సినిమాల్లో అవకాశం సంపాదించడం జరిగింది. కోట శ్రీనివాసరావు, భార్య పేరు రుక్మిణి, వారికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కొడుకు. అయితే కొడుకుని అమితంగా ఇష్టపడే కోటకు, 

ఆ దేవుడు అతడిని యాక్సిడెంట్ రూపంలో వారి నుండి దూరం చేసాడు. జూన్ 2010లో హైదరాబాద్ శివార్లలో జరిగిన ఘోరమైన బైక్ యాక్సిడెంట్ లో కోట కుమారుడు విజయ ఆంజనేయ ప్రసాద్ హఠాన్మరణం పొందారు. ఇక ఆ ఘటనతో ఒక్కసారిగా కృంగిపోయిన కోట, అప్పటినుండి సినిమాలు మెల్లగా తగ్గించారు. అంతేకాక ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి కూడా తగ్గింది. ఇక ప్రస్తుతం ఆయన అక్కడక్కడా అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నంది మరియు పద్మశ్రీ అవార్డు తో సహా పలు రకాల అవార్డులు అందుకున్న కోట, హిందీ మరియు తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఇక కోట సోదరుడు శంకర్ రావు, అక్కడక్కడ సినిమాల్లోను, అలానే ఇటీవల సీరియల్స్ లోను నటిస్తున్నారు.  ఈ విధంగా తెలుగు సినిమా పరిశ్రమకు నటుడిగా ఎనలేని సేవలందించిన కోట గారు, టాలీవుడ్ గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: