ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన స్వర సంగమం సంగీత విభావరికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా రంగానికి చెందిన సంగీత, వాయిద్య కళాకారుల యొక్క సంక్షేమం కోసం నిధుల సేకరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి గారు మాట్లాడుతూ సంగీతమంటే నాకు ప్రాణం అని సంగీతం లేకపోతే నేను లేనని అన్నారు. ఎంతోమంది సంగీత దర్శకులు, గాయకుల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యానని చిరంజీవి గారు అన్నారు. 
 
చిరంజీవి మాట్లాడుతూ ఒకప్పుడు మద్రాస్ నగరంలోని స్టూడియోలలో లైవ్ ఆర్కెస్ట్రాతో రికార్డింగ్ స్టూడియోల్లో రికార్డింగ్ చేస్తోంటే పండగ లాంటి వాతావరణంలా ఉండేది. ప్రస్తుతం కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావటంతో డిజిటల్ ఎఫెక్టులను ఉపయోగించి చిన్న గదుల్లోనే ప్రస్తుతం సంగీతం సృష్టిస్తున్నాం. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావటంతో వాయిద్య కళాకారులు ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కొత్త టెక్నాలజీలు రావటం పట్ల ఆనందపడాలో, బాధపడాలో అర్థం కావట్లేదు. కష్టాల్లో ఉన్న వాయిద్య కళాకారులను ఆదుకోవాల్సిన భాద్యత సినీ పరిశ్రమపై ఉంది. నా వంతుగా నేను సాయం అందిస్తున్నానని అన్నారు చిరంజీవి. 
 
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాట ఎంత గొప్పగా పాడినా ఆ పాటకు తగిన విధంగా తెరమీద అభియనించినప్పుడే ఆ పాటకు సార్థకత ఉంటుంది. అలా నేను పాడిన పాటలకు చిరంజీవి అత్యద్భుతంగా అభినయించటంతో పాటు తెరపై ఆ పాటలకు ప్రాణం పోసాడు . సైరా నరసింహారెడ్డి సినిమాలో మరోసారి చిరంజీవి తనలోని అభినయ కోణాన్ని చూపించబోతున్నాడని బాల సుబ్రహ్మణ్యం అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ, దేవీశ్రీప్రసాద్, కీరవాణి, కోటి, అనూప్ రూబెన్స్, ఆర్పీ పట్నాయక్, కల్యాణిమాలిక్, రఘుకుంచె, శ్రీలేఖ, రాధాకృష్ణన్ పాటలు పాడారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, రేణుదేశాయ్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, తదితరులు ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: