సీనియర్ హీరో నాగార్జునకు ఈ మధ్య కాలంలో ఎందుకో కలిసిరావట్లేదు. ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ ఫలితాన్నే అందుకుంటుంది. మనం, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో హిట్లు కొట్టిన నాగార్జున ఊపిరి సినిమాలో కార్తీతో కలిసి నటించాడు. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చవటంతో చివరకు కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఊపిరి తరువాత నాగార్జున ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటించాడు. 
 
ఈ సినిమాకు క్రిటిక్స్ మంచి రివ్యూలు ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు పట్టించుకోకపోవటంతో సినిమా ఫ్లాప్ అయింది.ఈ సినిమా తరువాత ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది సినిమా సీక్వెల్ లో నటించాడు నాగార్జున. ఈ సీక్వెల్ కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. శివ లాంటి హిట్ ఇచ్చాడన్న కృతఙతతో ఫ్లాపుల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మకు అవకాశం ఇచ్చాడు నాగార్జున. 
 
రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ఆఫీసర్ సినిమాకు కోటి రుపాయల షేర్ వసూళ్ళు మాత్రమే వచ్చాయి. నాగార్జున సినిమా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఫలితం అందుకుంది ఆఫీసర్. ఆఫీసర్ తరువాత నాగార్జున నానితో కలిసి దేవదాస్ సినిమాలో నటించాడు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ దేవదాస్ సినిమా కమర్షియల్ గా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 
 
గత శుక్రవారం విడుదలైన మన్మథుడు2 సినిమాకు తొలి షో నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది. కలెక్షన్లు బాగానే వస్తున్నాయని నాగార్జున చెబుతున్నప్పటికీ మన్మథుడు2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించట్లేదు. నాగార్జున ప్రస్తుతం హిందీలో ఒక సినిమా, తెలుగులో బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత బంగార్రాజు సినిమాలో నటించబోతున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమా సీక్వెల్ గా రూపొందుతున్న బంగార్రాజు సినిమా అయినా నాగార్జునకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: