రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డీవీవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 400 కోట్ల బడ్జెట్తో డీవీవి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ నుంచి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. ఆగష్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీ సాయంత్రం 4.50 గంటలకు కొమరమ్ భీమ్ పాత్రలో ఎన్టీయార్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. 
 
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్రలో నటిస్తున్నారు. చరిత్ర ప్రకారం అల్లూరి సీతారామరాజు, కొమరమ్ భీమ్ కలిసినట్లు లేకపోయినప్పటికీ, ఈ ఇద్దరూ కలిసి పోరాటం సాగిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించాడని తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ సరసన హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది. 
 
రాజమౌళి ఈ సినిమా విషయాలు ఏవీ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. బాహుబలి, బాహుబలి2 సినిమాల తరువాత రాజమౌళి గ్రాఫిక్స్ ఉపయోగించి సినిమాలు తీయనని చెప్పినప్పటికీ తన నిర్ణయం మార్చుకుని భారీ స్థాయిలో గ్రాఫిక్స్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా హక్కుల కోసం టాలీవుడ్, మిగతా రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పోటీ ఉందని సమాచారం. 
 
రాజమౌళి మాత్రం నిర్మాత దానయ్యకు ఈ సినిమా హక్కులు తన మిత్రులైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, సాయి కొర్రపాటి ముగ్గురికీ తెలుగు రాష్ట్రాల హక్కులతో పాటు, కర్ణాటక హక్కులు ఇవ్వమని సూచించాడని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ ఓవర్సీస్ హక్కులు 66 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: