యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తో వచ్చిన ఆ క్రేజ్ తో ప్రభాస్ మార్కెట్ కూడా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ను విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు చైనా లోను బాహుబలి బాగా కలెక్షన్లను రాబట్టింది. ఇక యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సినిమా సాహో. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సాహో థియోట్రికల్ ట్రైలర్ అన్నీ భాషల్లోను లక్షల కొద్ది వ్యూస్ ని సాధిస్తూ కొత్త ట్రెండ్ ని క్రియోట్ చేస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ తన బలహీనతల్ని బయటపెట్టాడు. తనకు మొహమాటం, బద్ధకం ఎక్కువని.. వాటితో పాటు జనాల్లో కలవడానికి కూడా చాలా ఇబ్బంది పడతానని ఇన్నాళ్ళకు నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు తన సినిమా విడుదలకి ముందు రోజు నుంచి ఒత్తిడిని తట్టుకోవడం కూడా తనవల్ల కాదని స్పష్టంచేశాడు ప్రభాస్. 

"రిలీజ్ రోజు నేను ఎవరిని  కలవను. పూర్తిగా నా ఫ్రెండ్స్ తోనే ఉండిపోతాను. ఈ ప్లాన్ లో ఎలాంటి మార్పులేదు. రిలీజ్ రోజు దాదాపు చచ్చిపోయినంత పని అవుతుంది నాకు. అయితే ఈ విషయంలో మారాలని బాహుబలికి ముందు ఓసారి ట్రై చేశాను. రెబల్ సినిమాను ఎలాగైనా ప్రేక్షకులతో కలిసి చూడాలనుకున్నాను. మార్నింగ్ షోకు బయల్దేరాను కూడా. కానీ దారిలోనే డ్రాప్ అయిపోయాను. హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది." అంటు చెప్పాడు. అంతేకాదు తన సినిమా రిలీజ్ రోజున ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూడకుండా ఇంట్లోనే పడుకుంటానంటున్నాడు ప్రభాస్. అయితే పూర్తిగా నిద్రపోనని, తనను ఎవరు  డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో పడుకుంటానని కలరింగ్ ఇస్తానని చెప్పుకొచ్చాడు. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే లేపమని తన స్నేహితులకు చెబుతాడట.  

"రిలీజ్ రోజు నేను పడుకుంటాను. సినిమాకు హిట్ టాక్ వస్తేనే లేపమంటాను. లేదంటే లేపొద్దని చెబుతాను. బాహుబలి-1కు నన్ను ఎవ్వరూ నిద్రలేపలేదు. నార్త్ నుంచి మంచి టాక్ వచ్చింది. తెలుగులో మాత్రం ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు. దీంతో నన్ను ఎవ్వరూ నిద్రలేపలేదు. నేనే లేచి ఏమైందని అడిగాను. జనాలకు నచ్చలేదన్నారు. కట్టప్ప, బాహుబలిని పొడిచి చంపడం జనాలకి అసలు ఎక్కలేదన్నారు. కానీ తర్వాత రోజు నుంచి మాత్రం సినిమా క్లిక్ అయింది." అంటు బాహుబలి సినిమా విషయాలను చెప్పాడు.అంతేకాదు ఇంతవరకు ఎప్పుడు బయట పెట్టని తన బలహీనతల్ని ఒక్కొక్కటిగా బయటపెట్టాడు ప్రభాస్. ప్రమోషన్స్ కూడా రావడం తనకు ఇష్టముండదని, తప్పనిసరి పరిస్థితుల మధ్య ప్రచారానికి వస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఆగస్ట్ 15 న రావాల్సిన సాహో సినిమా కాస్త ఆలస్యంగా 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: