బాల న‌టిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి తెలుగు తెర‌ని ఒక ఊపు ఊపిన తార శ్రీ‌దేవి జయంతి నేడు. ఆ అందాల నటి శ్రీదేవి ఈ ‘తెర’మరుగై ఏడాది దాటిపోతుంది. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించారు. అతిలోకసుందరి శ్రీదేవి 54వ జయంతి సందర్భంగా ఆమె కూతురు జాన్వి కపూర్ తన తల్లిని గుర్తు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మామ్ చిత్రంలోని శ్రీదేవి చిత్రాన్ని పోస్ట్ చేసిన జాన్వి.. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా, ఐ లవ్ యూ’ అని పోస్ట్ చేసింది. అంతేకాదు.. శ్రీదేవికి ఇష్ట దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని జాన్వి దర్శించుకుంది. గుడి బయటకు వచ్చి మోకాళ్లపై కూర్చొని తలను భూమికి ఆనించి మొక్కుకుంది. ఈ సందర్భంగా జాన్వి తెలుగు సంప్రదాయ దుస్తులు.. లంగా ఓణిలో రావడం విశేషం. నాలుగేళ్ళ ప్రాయంలో శ్రీదేవి ‘కాంధన్ కరుణై’ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచమయ్యారు. చక్కని రూపంతో, తక్కువ ప్రాయంలోనే అద్భుత నటన కనబరుస్తున్న శ్రీదేవి పదుల సంఖ్యలో బాలనటిగా అవకాశాలు దక్కించుకున్నారు. ఇక 1978లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ’16వయతినిలే’ చిత్రంతో మొదటిసారిగా పూర్తిస్థాయి నటిగా మారారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, రజని నటించడం విశేషం. ఇదే చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్ర రావు, ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో ఆమెతోనే తెలుగులో రీమేక్ చేయగా రెండు భాషల్లో ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది.


ఇక ఎనభై ,తొంబై దశకాలలో రెండు తరాల టాప్ హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు తోపాటు, చిరంజీవి,వెంకటేష్, నాగార్జునలతో ఈమె నటించారు. శ్రీదేవి 1994 చిరంజీవితో నటించిన ‘ఎస్పీ పరుశురాం’ తెలుగులో చివరి చిత్రం. బాలీవుడ్ లో అప్పటికే అనేక చిత్రాలు చేసిన శ్రీదేవి 1994 తరువాత హిందీ చిత్రాలకే పరిమితమయ్యారు. అద్భుత విజయాలతో టాప్ స్టార్స్ పక్కన నటిస్తూ, తిరుగులేని తారగా ఎదిగారు. బాలీవుడ్ పై ఆధిపత్యం చెలాయించిన మొదటి సౌత్ హీరోయిన్ గా శ్రీదేవి మిగిలిపోయారు.


ఇక 1996లో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని శ్రీదేవి వివాహం చేసుకున్నారు. అప్పటికే బోని కపూర్ కి పెళ్ళై పిల్లలు ఉన్నారు. పెళ్ళైన తరువాత చిత్రాలలో నటించడం తగ్గించిన శ్రీదేవి, గతకొన్నేళ్ళుగా కధానాయిక ప్రాధాన్యం చిత్రాలలో నటిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ భాషలలో నటించిన శ్రీదేవి 300పైగా చిత్రాలలో నటించారు. గత ఏడాది ఓ వేడుకలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లిన ఆమె ఫిబ్రవరి 24న ఓ హోటల్ లోని స్నానపు గదిలో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించడం జరిగింది. ఐతే ఆమె మరణం పై అనేక అనుమానాలున్నాయి. కాక‌పోతే ఎంతో లెజండ‌రీ యాక్ట‌ర్ అయిన ఆమె బాత్ ట‌బ్‌లో కాలు జారి చ‌నిపోవ‌డం అనేది చాలా మందికి న‌మ్మ‌స‌క్యంగా అనిపించ‌లేదు. ఏది ఏమైన‌ప్ప‌టికీ త‌న కూతురు జాన్విని వెండి తెర పై హీరోయిన్‌గా చూడాల‌న్న ఆమె కోరిక కూడా నెర‌వేర‌క ముందే చ‌నిపోవ‌డం చాలా మందిలో బాద‌క‌లిగించిన విష‌యం.



మరింత సమాచారం తెలుసుకోండి: