టెలికం బిజినెస్ రంగం లో అన్నీ నెట్ వర్క్స్ కి చుక్కలు చూపించిన వాళ్ళు అంబానీ ఫ్యామిలి. ఇప్పటికే పెద్ద నెట్ వర్క్స్ చతికిల పడ్డాయి. ఇక రిలయన్స్ జియో వచ్చాకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత మరో కొత్త సంచలనానికి శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది. రీసెంట్‌గా జరిగిన ఆర్ ఐ ఎల్ 42వ జనరల్ బాడీ మీటింగ్ లో అంబాని ఓ సరికొత్త ఆఫర్ ని తెరపైకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న జియో ఫైబర్ కస్టమర్లు ఇకపై కొత్త సినిమాలను విడుదల రోజునే తమ ఇళ్ళలో కూర్చుని చూసే గొప్ప అవకాశాన్ని కలిగించబోతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. 

ఫస్ట్ డే ఫస్ట్ షో పేరుతో అందుబాటులోకి రానున్న ఈ కొత్త విధానంతో నచ్చిన హీరో సినిమాని హాయిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు తమ స్టార్ హీరో సినిమా టికెట్స్ దొరకవనే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ పద్ధతితో సినిమా థియేటర్లకు గట్టి దెబ్బ పడనుందని అర్థమవుతోంది. ఇప్పటికే పైరసీ రూపంతో థియేటర్స్ వెలవెల బోతున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్, అమెజాన్ వంటి కార్పొరేట్ దిగ్గజాల రాకతో ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించడం ఇప్పటికే గత కొంతకాలంగా చాలా కష్టంగా మారింది. ఇప్పటికే చాలామంది థియేటర్లకు రావడం మానేశారు. ఇప్పుడు జియో కొత్త విధానంతో ఇక దేశవ్యాప్తంగా ఉన్న వేల థియేటర్ల పరిస్థితి ప్రశ్నార్థకమవడం ఖాయం. 

థియేటర్ల యాజమాన్యాల దగ్గరనుండి, డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థలు చిన్నా భిన్నం కానున్నాయి. అంతేకాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా సినిమా పరిశ్రమపై ఆధారపడిన చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. దీనితో ఐమ్యాక్, ఐనాక్స్, పీవీఆర్ సినిమాస్ వంటి దేశీయ థియేటర్ యాజమాన్య సంస్థలు ఆందోళన మొదలుపెట్టాయి. థియేటర్ల మనుగడను దెబ్బతీసే ఇలాంటి విధాలకు అనుమతులు ఇవ్వకూడదంటు నిరసనలు తెలుపుతున్నారు. అయితే అంబానీకి ఇవన్నీ అసలు పట్టింపు లేకుండా ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: