''సినిమాల్లో ఏముంటుందని చాలామంది అంటుంటారు. సినిమా రంగంలో ఎంతో మంది మేథావులున్నారు. ఏ కొద్దిమందినే చూసి అంచనా వేయకండి. ఎంతోమందికి చైతన్యాన్ని సినిమా ఇస్తుంది. 'మాలపిల్ల', 'మాభూమి', 'దాసి' వంటి చిత్రాలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలిచ్చాయి. నేను బయట గళం విప్పి మాట్లాడుతున్నానంటే ఆ శక్తి సినిమానే ఇచ్చింది. అందుకు కళామతల్లి పాదాలకు బద్ధుడునై వుంటాను'' అని పవన్‌కళ్యాణ్‌ అన్నారు. ప్రముఖ పాత్రికేయులు, విశ్లేషకులు తెలకపల్లి రవి రాసిన 'మన సినిమాలు అనుభవాలు- చరిత్ర- పరిణామం' అనే పుస్తకాన్ని మంగళవారంనాడు హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో పవన్‌కళ్యాణ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ... తెలుగు సినిమా గొప్ప శక్తివంతమైంది. 'మహానటి'కి అవార్డు రావడం గొప్ప అదృష్టం. ఇలాంటి విలువలున్న సినిమాలు మరిన్ని రావాలి. 'బాహుబలి' వంటి సినిమాలు వచ్చినా ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగలం. మన దగ్గరే అద్భుతమైన సాహిత్యం వుంది. చాలా మందికి వాటి గురించి తెలీదు. అందుకే సాహిత్యమేథావుల సాయంతో తెలుగు రాష్ట్రాలనుంచే ప్రపంచాన్ని శాసించే చిత్రాలు తీయగలం. అన్ని మైత్రీలకంటే సాహితీ మైత్రీ చాలా గొప్పదని సీనియర్‌ జర్నలిస్టు అప్పట్లో నాతో చెప్పారు. అది అలా గుర్తిండిపోయింది. చిన్నప్పుడు ఇలాంటి మేథవులు మాట్లాడుతుంటే బిడియం వుండేది. లక్షమందిని ఎదుర్కోవడం కష్టంకాదు. లక్ష మెదళ్ళను కదిలించే రచయితను, కవిని ఎదుర్కోవడం చాలా కష్టం. రావికొండలరావుగారు చెప్పినట్లు.. ఇలాంటి మన సినిమా చరిత్రను ఇంకా నిక్షిప్తం చేయాలి. ఎంతోమంది మేథావులు అందుకు నడుం కట్టాలి. అందుకు నావంతు సాయం చేస్తాను. ఆ పల్లకి మోసే భుజాన్ని అవుతాను. నేను చాలా సినిమాల్లో మాట్లాడను. ఎందుకంటే ఎంతో అనుభవంతో, మేథస్సుతో చాలా మంది వుంటారు. వారి ముందు నేను తలదించుకునే వుంటాను. తల ఎగరేయను. ఒక వాక్యం రాయాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. ఎన్నో రక్తపు చుక్కలు చిందిస్తేనే మంచి వ్యాఖ్యాలు వస్తుంటాయని ఓ రచయిత చెప్పాడు. అలాంటి ఎంతోమంది రచయితలు రాసిన మాటలే నన్ను బయట మాట్లాడేట్లుగా చేసింది. నేను మదరాసులో వున్నప్పుడు బుక్‌ఫెయిర్‌ జరిగినప్పుడు బంధోపాయ్‌ధ్యాయ్‌ రాసిన 'వనవాసి' పుస్తకాన్ని చదవలేకపోయా. ఓ రోజు షూటింగ్‌లో భరణిగారిని అడిగాను. ఆయన తెచ్చి ఇచ్చారు. 'గబ్బర్‌సింగ్‌' హిట్‌ అయిన ఆనందం కంటే 'వనవాసి' చదివాక కల్గిన ఆనందమే ఎక్కువ. చాలామంది సినిమావాళ్ళంటే అవహేళన చేస్తారు. కానీ ఒక్కోవ్యక్తిలో ఎంతో కృషి వుంటుంది. కొద్దిమందిని చూసి జడ్జ్‌ చేయకండి. వెంకటాచలంగారు 'మైదానం' వంటివి రాశారనే తెలుసు. కానీ 'మాలపిల్ల'కు మాటలు రాశారని రవిగారి పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలను మనకు తెలియని సంగతులు పుస్తకాల్లో వుంటాయి. అందుకే నాకు రచయితలంటే గౌరవం. 'జానీ' సినిమా తీస్తుండగా టీచర్‌ చెప్పిన ఓ కథ గుర్తుకువచ్చింది. తను చచ్చిపోతున్నా ఒకరిని బతికించే కథ అది. దాన్ని సినిమాగా చేద్దామంటే ఎన్నో అడ్డంకులు. ఆ కథను సరిగ్గా తీయలేకపోయా. అయితే పరుచూరి బ్రదర్స్‌ సామాజిక సమస్యలను అందరికీ హత్తుకునేలా తీసుకోగలరు. వారి రచనాశక్తి గొప్పది. ఇలాంటి వ్యక్తుల్ని చూస్తే నాకు గౌవరం. అందుకే నేను తగ్గివుంటాను. నిరంతనం నేర్చుకోవాలనే తపన పుస్తకాలు ద్వారానే కలుగుతుంది. చిన్నప్పుడు స్కూల్‌కు వెళుతుంటే 'మాభూమి' సినిమాలో పదాలు చూసేవాడిని. 'పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప. 'దాసి', 'రంగులకల' సినిమాలు చూశాక గద్దర్‌గారు ప్రజాసమస్యల్ని ఎంత అందంగా తీసుకువచ్చారో అనిపించేది. ఇలాంటి ఎన్నో మన చరిత్రలో దాగి వున్నాయి. అవి తెలిస్తే కొత్త సినిమాలు తీయగలం. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చూస్తే అదో గొప్ప చరిత్ర. ఇలాంటివి చాలా వున్నాయి. వెలికి తీయాలి. ఒక్కోటి కోహినూర్‌ వజ్రం లాంటివి. మన తెలుగురాష్రాల్లోనూ, భారత్‌లోనే ఎన్నో కథలున్నాయి. వాటిని తీయాలంటే మేథావుల, రచయితలు సమూహం ముందుకు రావాలి. సుద్దాల అశోక్‌తేజ పాటలు ఉత్తేజాన్ని కల్గించాయి. పరుచూరి బ్రదర్స్‌ సినిమాలు నిజజీవితాన్ని ప్రభావితం చేస్తే నిజజీవితం సినిమాను ప్రభావితం చేసేలావుంటాయి. నేనూ నా సినిమాల్లోనూ నన్ను ప్రేరేపించిన చూసిన విషయాలను ఆలోచనల్ని నావంతు ప్రయత్నంగా సినిమాల్లో పెడతాను. అది గబ్బర్‌సింగ్‌ కావచ్చు. మరేదైనా కావచ్చు. ఏ హీరో నటించినా మంచి సినిమాలు తీస్తే వాటిని ప్రేమించేవాడిని'' అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: