టాలీవుడ్ పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన పవన్ కళ్యాణ్, ఇటీవల సినిమాలకు పూర్తిగా స్వస్తిపలికి ఇకపై తన రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే అప్పుడపుడు మధ్యలో కొన్ని సినిమాలకు సంబందించిన కార్యక్రమాలకు పవన్ హాజరవుతుండడంతో, ఆయన మళ్ళి సినిమాల్లోకి రావాలని పలువురు అభిమానులు కోరుతుండడం అక్కడక్కడా జరుగుతూనే వస్తోంది. అయితే తనపై ఉన్న అమితమైన ప్రేమతో సినిమాల్లో మళ్ళి నటించండి అనే వారి ఆహ్వానాన్ని పవన్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. 

ఇకపోతే, నిన్న హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ప్రముఖ జర్నలిస్ట్ మరియు విశ్లేషకులు అయిన తెలకపల్లి రవిగారు రాసిన మన సినిమాలు, అనుభవాలు, చరిత్ర, పరిణామాలు పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఇక ఈ వేడుకకు తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, వనమాలి, పరుచూరి వెంకటేశ్వరరావు, రావి కొండల రావు గారితో పాటు ప్రత్యేక అతిథిగా హాజరయిన పవన్ కళ్యాణ్ గారు, తెలకపల్లి రవి గారు రాసిన మన సినిమాలు పుస్తకంపై తనదైన శైలిలో విశ్లేషిస్తూ మాట్లాడారు. ఇక మాటల సందర్భంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తన కెరీర్లో తాను కథ, కథనంతో పాటు దర్శకత్వం వహించిన జానీ సినిమా ఘోర పరాజయాన్ని అందుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిజానికి తన చిన్నతనంలో తనకు తెలిసిన ఒక వ్యక్తి, తాను మరణిస్తున్నాను అని తెలిసి కూడా కుటుంబసభ్యులకు మంచి జీవితాన్ని ఇవ్వాలని తాపత్రయపడడం చూశానని, ఆ సంఘటనే తన జానీ సినిమాకు స్ఫూర్తిగా తీసుకుని కథ రాయడం జరిగిందని తెలిపారు. 

అయితే మన సినిమాల్లో కమర్షియల్ విలువలు, హీరోయిజం వంటివి ఉండడం, స్టార్ హీరో చనిపోవడం అనేది మన తెలుగు సినిమాలో ఒప్పుకోరని చాలా మంది తనపై ఒత్తిడి తేవడంతో కథను చాలావరకు మార్చవలసి వచ్చిందని పవన్ తెలిపారు. ఆ విధంగా అసలు కథను మార్చి చిత్రీకరించడం వలన అందులోని ఫీల్ మిస్ అయిందని, కాబట్టే సినిమా పరాజయం పాలయిందని పవన్ అన్నారు. అయితే ఆ విధమైన ఆలోచనా ధోరణి మనలో మారాలని ఆయన అన్నారు. ఇక ఇటీవల బాహుబలి వంటి అద్భుతమైన సినిమాలు మన తెలుగులో వచ్చినప్పటికీ, రాబోయేరోజుల్లో అంతకుమించిన ఎన్నో అద్భుతమైన సినిమాలు రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పవన్ తెలిపారు......!!   


మరింత సమాచారం తెలుసుకోండి: