సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యానియా అలా ఇలా కాదుగా..ఆయన సిగరెట్టు ఎగరేయడం ఒక ఫ్యాషన్. నడకలో మరో స్టైల్. స్పీడ్ డైలాగ్ డెలివరీ ఇంకో ఫ్యాషన్. ఆయన డ్యాన్సులు కూడా ఓ మోజే. ఆయన ఫైటింగులు, యాక్షన్ సీన్లు ఒకటేంటి రజనీ అన్న మూడు అక్షరాలు  అంటే పడి చచ్చిపోతారు అభిమాన జనం. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి కర్నాటక ఆర్టీసీలో బస్ కండక్టర్ గా జాబ్ చేస్తూ సినిమాల్లో లక్ ని టెస్ట్ చేసుకోవడానికి మద్రాస్  వచ్చిన పాతికేళ్ళ యువకుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడో తెలుసా..


అది 1975 ఆగస్ట్ 18. అంటే ఇప్పటికి సరిగ్గా  ఇదే డేట్ న 44 ఏళ్ల క్రితం ప్రఖ్యాత దర్శకుడు కె   బాలచందర్ డైరెక్షన్లో రజనీకాంత్ అపూర్వ రాగంగల్ మూవీతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమానే తెలుగులో తూర్పు  పడమరగా దాసరి నారాయణరావు తీసారు. అక్కడ తమిళంలో రజనీ పోషించిన పాత్ర తెలుగులో మోహన్ బాబు వేశారు. ఆ సినిమాలో బాలచందర్ రజనీలో ఏం చూశారో కానీ రజనీ హవా అక్కడ నుంచి అలా మెల్లగా మొదలైంది.


తరువాత తెలుగులో తీసిన అంతులేని కధలో కూడా రజనీకాంత్ జయప్రద అన్నగా నటించి మెప్పించాడు. ఆ తరువాత ఆయన జోరు ఆగలేదు. ఓ స్థాయిలో పరుగులు తీసింది. ఆయన ఎక్కని మెట్లు లేవు. అధిరోహించని శిఖరాలు లేవు. రజనీ అంటే చాలు బాక్సాఫీస్ కలెక్షన వర్షమే. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు కనక వర్షమే.


ఇప్పటికి 44 ఏళ్ళుగా రజనీ ఎక్కడా తగ్గడంలేదు. అదే మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మధ్యలో ఎందరో హీరోలు వచ్చారు. వెళ్ళారు, ఆగిపోయారు కూడా కానీ రజనీ పరుగు ఆగడంలేదు. జనాలు చూస్తున్నారు, రజనీ నటిస్తూనే ఉన్నారు. దర్బార్ మూవీ రజనీ తాజా చిత్రం సెట్స్ మీద ఉంది. 2021 వరకూ నటించి  రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్న రజనీకి ఇది 44వ సినీ వసంతం. ఈ రోజును గుర్తు చేసుకుంటూ అభిమానులు రజనీ అని మరో మారు గట్టిగా నినదిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: