సుజీత్‌ అంతర్జాయ స్థాయిలో గొప్ప దర్శకుడైపోతాడని హీరో ప్రభాస్‌ కితాబిచ్చాడు 'సాహో' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌, దర్శకుడు సుజీత్‌ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రమిది. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. యు.వి క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కింది. ఈ సినిమా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు.


ప్రభాస్‌ మాట్లాడుతూ 'ఫ్యాన్స్‌ నాడి సుజీత్‌కి బాగా తెలుసు. ఈ సినిమాకి ఇంటర్నేషనల్‌ లుక్‌ తీసుకురావడానికి కమల్‌ గారే కారణం. చాలా కాలంగా అనుకుంటున్నా..జాకీష్రాఫ్‌తో ఈ సారి పని చేయడం కుదిరింది. అరుణ్‌ విజరు, లాల్‌, నీల్‌ సార్‌ మీరంతా సపోర్ట్‌ చేసినందుకు ధన్యవాదాలు. అనిల్‌ థడాని మొదటి రోజు నుంచి చివరి వరకూ సపోర్టు చేశారు. నిర్మాతలంతా సుజీత్‌ దగ్గర కథ ఉంది ఓసారి వినమని చెప్పారు. సుజీత్‌ కథ చెప్పడానికి నిక్కరేసుకొని నాదగ్గరకొచ్చాడు. అప్పుడు అతనికి 24 ఏళ్లు ఉంటాయి. కథ మాత్రం 40 ఏళ్ల అనుభవం ఉన్నవాడిలా చెప్పాడు. ఆరునెలలు పాటు తీవ్రంగా కష్టపడ్డాక సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సెట్‌లో అందరూ పెద్దవాళ్లే. వీళ్లందరినీ సుజీత్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తాడనుకున్నా. సూపర్బ్‌గా హ్యాండిల్‌ చేశాడు. వీళ్లందరినీ హ్యాండిల్‌ చేసిన తర్వాత ఇతను గ్రేటెస్ట్‌ డైరెక్టర్‌ అయిపోతాడనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇతనొక ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ అయిపోతాడేమో అనిపిస్తుంది. శ్రద్ధా ఈ సినిమా కోసం రెండేళు ్ల పని చేసింది. ఎక్కడో ముంబాయి నుంచి ఇక్కడకొచ్చి ఓ యాక్టర్‌ ఓ సెట్‌లో రెండేళ్ల పాటు పని చేయడం మాటలు కాదు. అదీ ఏ ఒక్క రోజూ ఎటువంటి సమస్యా లేకుండా అంటే మాటలా?. ఆమె మాకు సపోర్టు చేయడం మా అదృష్టం. యాక్షన్‌ సీన్స్‌ ఈమె ఇరగదీస్తుంది. నిర్మాతలు ప్రమోద్‌, వంశీ, విక్కీ ..అంతా వంద కోట్ల ప్రాఫిట్‌ వదిలేసి ఈ సినిమా చేశారు. వీళ్లు నాకు మంచి స్నేహితులు'' అని తెలిపారు. 


రాజమౌళి మాట్లాడుతూ 'సుజీత్‌ ఇంత పెద్ద సినిమా చేయగలడా? అని అంతా అనుకున్నారు. టీజర్‌ వచ్చాక అతని సత్తా ఏంటో అందరికీ అర్థమైపోయింది. ఇలా చేయడం మాటలు కాదు. ఓ ప్రొఫెషినల్‌ డైరెక్టర్‌లా చేశాడు. సుజీత్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రభాస్‌ ఏం అడిగితే అది చేసేస్తారు ఈ చిత్ర నిర్మాతలు. ఈ సినిమా చాలా పెద్ద రేంజ్‌లో ఉంటుంది. ప్రమోద్‌కి, వంశీకి మూడు రెట్లు అధికంగా లాభాలు రావాలి. ప్రభాస్‌ ఆలిండియా స్టార్‌. ఇంకా ఇంతకంటే ముందుకు తీసుకెళ్లాలి అంతే' అని పేర్కొన్నారు.


దర్శకుడు సుజీత్‌ మాట్లాడుతూ 'నేనొక షార్ట్‌ ఫిల్మ్‌ నుంచి వచ్చాను. ఓ డీవీడీ ఉండేది. వాటిని ఎక్కడకి పడితే అక్కడికి తిప్పేవాడిని. నేను చేసిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌ను ప్రభాస్‌ చూసి స్క్రీన్‌ప్లే బాగుందన్నారట. 'మిర్చి' సినిమాను థియేటర్‌లో చూస్తూ ప్రభాస్‌ నన్ను రమ్మని కబురు పెట్టారు. అప్పుడు నేను పెద్దగా నమ్మలేదు. నన్ను ప్రభాస్‌ పిలవడం ఏమిటా? అని అనుమానంతో వెళ్లలేదు. చాలా రోజులు తర్వాత వెళితే 'ఏం డార్లింగ్‌ అప్పుడు పిలిచాను. రాలేదేం' అని అన్నారు. ప్రభాస్‌ ఓ హార్డ్‌ డిస్క్‌ లాంటివారు. నేను ఆయనకు కథ చెప్పినప్పుడు చివరిలో తల నుంచి బ్లడ్‌ వస్తుందని చెప్పాను. ఆ విషయం నేను ఎప్పుడో మరిచిపోయాను. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు ఆయనే గుర్తు చేశారు. అందరూ ఇంత పెద్ద చిత్రాలను నేను చేయగలనా? అని అనుమానం వ్యక్తం చేస్తుంటే.. 'నువ్వు తీయగలతావు డార్లింగ్‌' అని ప్రభాస్‌ ధైర్యం చెప్పారు. ఎవరు ఏం అన్నా ఆయన అదే చెప్పేవారు. ప్రభాస్‌ నన్ను అంతలా నమ్మారు. 'బాహుబలి'లా కాకుండా ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నా అవి కనబడనట్టు ఉండాలి. ఇంత పెద్ద భారీ బడ్జెట్‌ చిత్రమైనా నిర్మాతలు నాపై ఎటువంటి ఒత్తిడీ లేకుండా చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి కథానాయికగా ఎవరు ఉండాలని అనుకున్నప్పుడు మొదటి మా నా మనసులోకి వచ్చింది శ్రద్ధా కపూరే. ఆమె అద్భుతమైన నటి. నిరంతరం డైలాగులు బట్టీపట్టి మరీ చేస్తుంటుంది. ఈ సినిమా చూస్తే అరుణ్‌ విజరు ఎంత హెల్ప్‌ అవుతారో అర్థమవుతుంది' అని చెప్పారు. 


శ్రద్ధా కపూర్‌ ముందుగా తెలుగులోనే అందరికీ హారు చెప్పిన అనంతర మాట్లాడుతూ 'హైదరాబాద్‌ నాకు రెండో ఇల్లు. 'సాహో'తో పనిచేయడం పెద్ద అనుభూతినిచ్చింది. తెలుగులో ఇదే నా తొలి సినిమా. ప్రభాస్‌ అమేజింగ్‌ నటుడు' అని చెప్పింది.


కృష్ణంరాజు మాట్లాడుతూ 'ఈ సినిమా హాలీవుడ్‌ చిత్రాలకు పోటీగా నిలుస్తుంది. మూడు నాలుగు రోజుల క్రితం ప్రభాస్‌ని కలిసినప్పుడు ఒకటే చెప్పాను. 'ఏం కంగారు పడొద్దు. నువ్వు పడ్డ కష్టానికి మంచి ఫలితమే లభిస్తుంది. సుజీత్‌ చిన్నవాడైనా పెద్ద టాస్క్‌ని చేశాడు. నిర్మాతలు ఇతనిపై పెద్ద భారం వేసినా శెభాష్‌ అనిపించుకుంటాడు. ఇంత భారీ అంచనాల మధ్య ఏదైనా తేడా ఉంటే అంటే.. అటువంటి సందేహం ఏమీ లేదని నా అనుభవంతో చెబుతున్నా' అని ప్రభాస్‌కి చెప్పాను కూడా అని కృష్ణం రాజు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: