బస్ కండక్టర్ గా పని చేసే వ్యక్తి సినిమాల్లో నటించి హీరోగా అటుపై సూపర్ స్టార్ గా ఎదగడమంటే మాటలు కాదు. అదీ స్థానికతకు, భాషకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తమిళ గడ్డపై ఓ మరాఠీ వ్యక్తి ఇంతటి ఘనత సాధించాడంటే ఆశ్చర్యమే. పుట్టింది మహారాష్ట్రలో, ఉద్యోగం కర్ణాటకలో, సూపర్ స్టార్ ఆయింది తమిళనాడులో. అతనెవరో కాదు.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలైవా.. సూపర్ స్టార్ రజినీకాంత్. అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. రజినీ సినిమా ప్రస్థానానికి 44 ఏళ్ళు పూర్తయ్యాయి.



రజినీలోని నటుడిని గుర్తించిన కె.బాలచందర్ ఆపూర్వ రాగంగళ్ లో తొలి అవకాశం ఇచ్చారు. 1975 ఆగస్టు 18న రిలీజైన ఆ సినిమాతో ఆకట్టుకున్న రజినీకాంత్ అటుపై సూపర్ స్టార్ గా తమిళ ప్రజల ఆరాధ్య నటుడయ్యాడు. తమిళనాట 25వేల అభిమాన సంఘాలున్న కథానాయకుడిగా చెలామణీ అయ్యాడు. రజినీ స్టయిల్, ముఖ్యంగా సిగరెట్ ను నోట్లో వేసుకునే తీరు రజినీ ట్రేడ్ మార్క్. రజినీ మానియా దేశంతో పాటు చైనా, జపాన్ దేశాలకూ పాకింది. బెంగళూరులో బస్ కండక్టర్ గా పని చేస్తున్న రజినీని సినిమాల్లో ట్రై చెయమని చెప్పింది ఆయన స్నేహితుడు..ఆ బస్ డ్రైవర్. అలా మొదలైన రజినీ ప్రస్థానం ఓ చరిత్ర.



ఆధ్యాత్మిక భావాలున్న రజినీ హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుని వస్తూంటాడు. తొంభైల్లో సినిమాలు వద్దనుకుని హిమాలయాలకు వెళ్లిపోయిన రజినీ కొన్నాళ్ళకు కుటుంబం కోసం వచ్చేసాడు. 2002 లో వచ్చిన బాబా తన ఆలోచనలకు ప్రతిరూపంగా ఉంటుంది. కథ కూడా రజినీ రాసిందే. సినిమా హిట్ అయితే సినిమాలకు బై చెప్దామనుకున్న రజినీకి ఫ్లాప్ తో  అవకాశం దక్కలేదు. మరిన్ని సినిమాలతో రజినీ అభిమానులను అలరించాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: