ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమ కు చెందిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఒక్కటే… టాలీవుడ్ స్థాయి బాగా పెరిగిపోయింది అని. ఈ మధ్యనే రిలీజ్ అయిన సాహో ట్రైలర్, కొన్ని గంటల ముందు వచ్చిన సైరా టీజర్ చూస్తేనే ఈ విషయం మనకు అర్థమవుతుంది. సినిమా లో ఉన్న విజువల్స్, క్వాలిటీ పక్కన పెడితే మన స్థాయి పెరిగింది అంటే ఒక సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్, తిరిగి రాబడుతున్న కలెక్షన్లే రుజువు. అయితే సినిమా కోసం కుమ్మరిస్తున్న కోటానుకోట్ల బడ్జెట్ మళ్లీ వసూళ్ల రూపంలో తిరిగి వస్తుందా?

సాహో సినిమా బడ్జెట్ అక్షరాలా 350 కోట్ల రూపాయలు. బాహుబలి సినిమా కి ముందు ఈ మాట విని ఉంటే అందరం పకపకా నవ్వే వాళ్ళం. సైరా సినిమా బడ్జెట్ 150 కోట్లు. ఖైదీ150 కి ముందు ఈ విషయం తెలిసి ఉంటే ఎంత చిరంజీవి అయినా సురేందర్ రెడ్డిని నమ్మి అది కూడా చారిత్రాత్మక సినిమా మీద ఇంత బడ్జెట్ ఏంది అని అందరం నోర్లు వెళ్ళబెట్టేవాళ్ళం. కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలాంటి సందేహాలు లేవు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర నుండి అభిమానుల వరకు అందరిలో గట్టి నమ్మకం...కొండంత ధైర్యం. ఎందుకు?

బాహుబలి మొదటి భాగం 180 కోట్ల తో తీస్తే ఆ చిత్రం 518కోట్ల గ్రాస్ సంపాదించింది. రెండో భాగానికి 250 కోట్లు వసూళ్ల రూపంలో రాలిన మొత్తం అక్షరాలా రెండు వేల కోట్లు. ఇప్పుడు శాటిలైట్ హక్కులు, డిజిటల్ మీడియా పార్ట్నర్స్, డబ్బింగ్ హక్కులు, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ సినిమా విడుదలకు ముందే ప్రొడ్యూసర్లు పెట్టుబడి మొత్తం తిరిగి రాబట్టుకున్నారు. ఒకవేళ సినిమా అటు ఇటు అయినా తమకు రావాల్సిన వచ్చేయగా… వసూళ్ల డబ్బులు బోనస్ మాత్రమే. 

ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ సాహో లాంటి మల్టీ మిలియన్ ప్రాజెక్టుకి కేవలం 10% రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటే అతనికి తెలుగు సినిమాలకు బయట ఉన్న మార్కెట్ పైన నమ్మకం. 'జెర్సీ' లాంటి చిన్న బడ్జెట్ సినిమా ఇప్పుడు రెండు భాషల్లో రీమేక్ కానుంది. నిజం చెప్పాలంటే 'జెర్సీ' సినిమా డైరెక్టర్ ఎవరో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో సగం మందికి తెలియదు. అది బయట తెలుగు సినిమాకి ఉన్న మార్కెట్. తమళంలో భారీ హిట్ సాధించిన ఒక సినిమా, ఆ సినిమా కథ దాదాపు టాలీవుడ్ లో అందరికీ తెలిసినా మెగాస్టార్ దాన్ని రీమేక్ చేస్తే అవలీలగా 100 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు ఇన్ని అంచనాల మధ్య వస్తున్న సైరా, అన్ని భాషల్లో విడుదల కానుంటే… వాళ్లు పెట్టిన భారీ బడ్జెట్ ఒక లెక్కా? 

కేవలం కలెక్షన్ల విషయంలోనే కాకుండా మొన్న ప్రధానం చేసిన జాతీయ అవార్డుల్లో కూడా ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమా పరిశ్రమ మిగతా చిత్రాలకు గట్టిపోటీని ఇచ్చి 4 అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇకనుండి 'తెలుగు సినిమా స్థాయి' అనే పదం ఉండకపోవచ్చు. 'భారత సినిమా స్థాయి' అన్నప్పుడల్లా ఒక తెలుగు సినిమాని గుర్తు చేసుకుని రేంజ్ లో ఉన్నాం మనం.


మరింత సమాచారం తెలుసుకోండి: