మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మాత మెగాస్టార్ తనయుడు రాం చరణ్ నిర్మిస్తున్న సైరా. బాలీవుడ్ కోలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. టీజర్ లో ఈ వాయిస్ ఓవర్ మెగా ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకుంటుంది. అయితే టీజర్ తోనే పవన్ పాత్ర ముగిసిపోలేదు. సైరా సినిమాలో కూడా పవన్ గొంతు వినిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రేక్షకులకు తెలిపారు.

సైరా టీజర్ లాంఛ్ లో మాట్లాడిన మెగాస్టార్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు.. మిగతా భాషల్లో కూడా కొంతమంది స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ చెప్పిన విషయాన్ని బయటపెట్టారు. సైరా సినిమా తెలుగు వెర్షన్ కు పవన్ కళ్యాణ్, తమిళ వెర్షన్ కు కమల్ హాసన్, మలయాళం వెర్షన్ కు మోహన్ లాల్ వాయిస్ ఓవర్ ఉంటుందని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సినిమా ప్రారంభంలో, ముగింపులో మాత్రమే ఈ వాయిస్ ఓవర్లు వినిపిస్తాయంటున్నారు. 

"తెలుగులో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తమిళంలో కమల్ హాసన్  మళయాళంలో మోహన్ లాల్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా ప్రారంభంలో వచ్చే ఇంట్రడక్షన్, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో ఈ స్టార్స్ వీళ్ల వాయిస్ ఓవర్లు ఉంటాయి." అని తెలిపారు మెగాస్టార్.

ఈ పదేళ్లలో ఫిలింమేకింగ్ చాలా మారిపోయిందన్న చిరంజీవి, మంచి కంటెంట్ దొరక్కపోవడం వల్ల బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వలేకపోయానంటున్నారు. సైరా సినిమాతో ఇన్నాళ్లకు మంచి కథ దొరికిందని, అందుకే బాలీవుడ్ లోకి మరోసారి వస్తున్నానని అన్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దాదాపు 270 కోట్ల తో తెరకెక్కించగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయన తార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కొణిదెల నిహారిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 2 న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: