మెగాస్టార్ చిరంజీవి.. ఇలా మారటానికి ముందు ఆయన కొణిదెల శివ శంకర వర ప్రసాద్ గా సినీ పరిశ్రమలోకి ఓ ప్యాషన్ తో అడుగుపెట్టారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్న చిరంజీవి ప్రత్యేకతల్లో ముఖ్యమైనవి ఆయన డ్యాన్సులు, ఫైట్లు. ఈ రెండు ప్రత్యేకతలు తెలుగు సినిమా గమనాన్నే మార్చేశాయి. చిన్న పాత్రల నుంచి హీరోగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి.

 


ఆరేళ్ల పిల్లల నుంచి అరవయ్యేళ్లవారి వరకూ అందరినీ ఎంటర్ టైన్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1987 నుంచి 1992 వరకు ప్రతి ఏడాదీ ఒక్కో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి మెగాస్టార్ గా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్స్ మూమెంట్ ను మొదలుపెట్టిన చిరంజీవి చిన్న పిల్లల మనసులో సుస్థిర స్థానం సంపాదించారు. వారే నేడు మెగా ఫ్యాన్స్ గా ఆయన పెట్టని కోటలై స్థిరపడిపోయారు. ఇందుకు ఆయనకు మేనేజర్ గా పనిచేసిన మోహన్ అనే వ్యక్తి కారణమని ఓ ఇంటర్వూలో చెప్పారు. తొలినాళ్లలో ఓ డ్యాన్స్ మూమెంట్ చేసి ఎలా వుంది అనడిగితే.. “ఈ డ్యాన్స్ అందరూ చేసేదే.. ఆ డ్యాన్స్ లో గ్రేస్, ఓ స్పెషల్ చూపిస్తేనే కదా నీకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేది” అన్నారట. ఆ మాటలు చిరంజీవి జీవితంలో ఎంతో ప్రభావం చూపాయట. అప్పట్నించి ఆయన చేసిన డ్యాన్సుల్లో గ్రేస్, పాటల్లో హావభావాలు ఓ చరిత్ర. తాను పాడే పాటలకు తెర మీద నూరు శాతం న్యాయం చేసేది చిరంజీవి మాత్రమేనని ఎస్పీ బాలు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు.

 


చిరంజీవి 41 ఏళ్ల సినీ ప్రస్థానంలో అధిరోహించని శిఖరం లేదు. ఎందరికో ఆయన స్ఫూర్తి. చిరంజీవిలోని నట విశ్వరూపాన్ని ‘సైరా..’ లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన మరింతగా ప్రేక్షకులను అలరించాలని, ఉన్నత శిఖారాలను అధిరోహించాలని కోరుకూంటూ.. ఏపీ హెరాల్డ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: