ఆయన చరిత్ర ఒక వ్యక్తిత్వ వికాస మార్గదర్శి చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు. నాలుగు దశాబ్దాల అప్రతిహత విజయాల అద్భుత విజయగాధ. విజయాలు సాధించడమే కాదు, అవి సాధించబడిన విధానాలు కూడా ఆచరణ యోగ్యంగా ఆదర్శప్రాయంగా ఉండాలి అంటారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని పేరు ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పేరు. ఈ పేరు తెలియని తెలుగువాళ్లు ఉండనే ఉండరు. చిరంజీవి అనే పేరు జనంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందంటే ఎవరైనా కాస్త స్టైలిష్ గా కనిపిస్తే చిరంజీవిలా ఉన్నావు కదరా అని అనిపించుకునే అంతలా. ట్రెండ్ సెట్ చేయడమంటే ఇదే. ట్రెండ్ సెట్ చేశారు అనడానికి అసలైన నిర్వచనం ఇచ్చారాయన.


చరిత్ర మన గురించి చెప్పుకోకపోవచ్చు కానీ, చరిత్ర మనతోనే ఆరంభం కావాలి అనేది ఆయన నటించిన తాజా చిత్రం సైరాలో ఓ డైలాగ్. చిరంజీవి సినీ ప్రస్థానానికి అతికినట్టు సరిపోయే డైలాగ్ అది. తన కృషి పట్టుదలతో మాత్రమే ఆయన చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు. చరిత్రలో నిలిచిపోయేలా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆధునిక చిత్ర పరిశ్రమకు బాటలు వేశారు. భవిష్యత్తులో ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారో దశాబ్దాల కిందటే కనిపెట్టారు. దానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడమే కాదు, చిత్ర పరిశ్రమనూ మార్చివేశారు. బ్రేక్ డ్యాన్స్ కు చిరంజీవే ఆద్యుడు. 1978 లో తొలి చిత్రంగా విడుదలైన "ప్రాణం ఖరీదు"  మొదలుకొని రానున్న అక్టోబర్ రెండున విడుదల కానున్న 'సైరా' వరకు నలుదిశలుగా వికసించి, విస్తరించి, విజృంభించి, విశ్వవ్యాప్తమైన చిరంజీవి జీవిత ప్రస్తానాన్ని నాలుగు భాగాలుగా, నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు.


40 ఏళ్ల పైబడిన ఈ నాలుగు దశల కెరీర్ లో ఒక్కో దశలో చిరంజీవి అత్యంత ప్రజాదరణ పొందిన తారగా ఎదిగిన వైనంలో ఎన్నెన్నో స్ఫూర్తిదాయక లక్షణాలూ, లక్ష్యాలూ, కార్యసాధన, కార్యదక్షత కనిపిస్తాయి. 'కొణిదెల శివశంకర వర ప్రసాద్' అనే ఒక సామాన్యుడు అసామాన్యుడుగా అందనివాడిగా, అందరివాడుగా ఎదిగిన పరిణామక్రమాన్ని పరిశీలించి ప్రాణం ఖరీదు నుండి ఖైదీ దాకా సాగిన, చిరంజీవి ప్రస్థానంలోని తొలి దశను పరిశీలిస్తే అవకాశాల వేటలో ఎదురైన ఆశనిరాశలు, ఒడుదుడుకులు, ఆరాటం పోరాటం, అద్భుత విజయాలు, అనూహ్య పరాజయాలు వంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కనిపిస్తుంది. ఇలాంటి స్థితి నుండి ఖైదీ దాకా ఎగ్జిస్టెన్స్ కోసం చేసిన పోరాటంలో చిరంజీవి ప్రదర్శించిన సహన, సంయమన, సామర్థ్య, సాహస చాతుర్యాలు సత్ఫలితాల్ని ఇచ్చి ఆయనను ఓ ప్రామిసింగ్ స్టార్ గా నిలబెట్టాయి.



దర్శక నిర్మాతలు, రచయితలూ అని శిల్పులు ఎంత చెక్కిన, కొన్ని శిలలు శిలలు గానే మిగిలిపోతాయి. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే తమను తాము శిల్పాలుగా మల్చుకుంటారు. చరిత్రలో నిలిచిపోతారు. అలా తొలి దశలో తనను తాను చెక్కుకున్న చెక్కుచెదరని శిల్పమే చిరంజీవి. చిరంజీవి రాజకీయాల్లో ముద్ర వేయలేకపోయిన, రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేయలేకపోయారు. ఆనవాయితీగా వస్తున్న ట్రెండ్ ను అనుసరిస్తూ వెళ్లారే కాని, చిత్ర పరిశ్రమ తరహాలో రాజకీయ రంగంపై తనదైన ముద్ర వేయలేకపోయారు. దీనికి కారణాలు అనేకం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో తలపండిన ఇద్దరు హెమాహెమీలు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150' చిరంజీవి మళ్లీ పుంజుకోడానికి ప్రాణం పోసింది. 9 సంవత్సరాల విరామం తర్వాత మరలా హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి 150 కోట్ల వసూళ్లతో ఘన విజయాన్ని సాధించిన వన్ అండ్ ఓన్లీ కమ్ బ్యాక్ హీరోగా చరిత్ర సృష్టించారు చిరంజీవి. ఇక ఇప్పుడు 151 వ సినిమాగా రానున్న 'సైరా' పాత్ర పరంగ, చరిత్రపరంగా, నిర్మాణ పరంగా, ప్రతిష్ట పరంగా ఒక చారిత్రక విజయాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: