నందిత శ్వేత, రాశి, శివ కంఠమనేని ప్రధాన పాత్రధారులుగా లైట్‌ హౌస్‌ సినిమా మ్యాజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి సంజీవ్‌ మెగోటి దర్శకత్వం వహిస్తున్నారు.  శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.అశోక్‌ కుమార్‌ క్లాప్‌ కొట్టారు. విజయ్‌ కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఓ సరికొత్త క్రైం థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిస్తున్నాం. సినిమాకు కథే హీరో. తెలంగాణలో పుట్టిపెరిగిన లక్కీ అనే యువతి కథ ఇది. ఆమె ఇక్కడి ప్రాంతీయ పరిస్థితులకు తగ్గట్లుగా చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చింది చేసే తెగువ ఉన్న అమ్మాయిగా పెరుగుతుంది. కానీ, ఆమెకు ఓ అనుకోని సమస్య ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె దాన్ని అధిగమించడానికి యుద్ధానికి దిగుతుందా.. లేక తల్లి చెప్పినట్లుగా శాంతంగా వ్యవహరిస్తుందా అన్నది చిత్ర కథ. రాశి దేవకీ అనే పాత్రలో సరికొత్తగా కనిపించబోతుంది శివ కంఠమనేని క్రిమినాలజీ ప్రొఫేసర్‌గా కనిపిస్తారు. ఆయన నేరస్థులు ఎలా నేరాలకు పాల్పడతారు. ఆ సమయంలో వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి అన్న దానిపై పరిశోధన చేస్తూ.. పోలీసులకు ఓ వారధిలా సాయం చేస్తుంటార’’న్నారు.  ‘‘నేనిందులో ప్రధాన పాత్రను పోషిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నా. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం. 50 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సినిమాలోని ఐదు పాటలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు శివ కంఠమనేని.  ‘‘నేనింత వరకు ఎక్కువగా నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటించా. తొలిసారి ఈ సినిమాలో ఓ గ్లామర్‌ పాత్రను చేస్తున్నా. నేనిందులో లక్కీగా కనిపిస్తా. చాలా బోల్డ్‌గా కనిపిస్తా’’ అన్నారు నందితా శ్వేత. రాశీ మాట్లాడుతూ.. ‘‘చాలా విరామం తర్వాత ఓ మంచి పాత్రతో తెరపైకి వస్తున్నా. నేనిందులో నందిత తల్లిగా దేవకీ పాత్రలో కనిపిస్తా. చాలా కొత్తగా ఉంటుంద’’న్నారు. అన్నపూర్ణ, రాంబాబు, అంజన్, సుధాకరణ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: