సృష్టిలో జీవజాతులు అనేకం ఉన్నాయి. జీవాల మధ్య సారూప్యం లేకున్నా ప్రకృతిలో కలిసిమెలిసి జీవించడం సాధారణం. కొన్ని జీవాల మధ్య విరోధం ఉంటే మరికొన్ని జీవాల మధ్య ప్రేమ ఉంటుంది. మనుషులైతే ప్రేమ, స్నేహం, విరోధాలను పంచుకుంటారు. కానీ ప్రకృతిలోని మూగజీవాలు వీటిని వ్యక్తపరచుకోలేవు. కేవలం వాటి చర్యలు, అవి ప్రవర్తించే తీరును బట్టి మనమే అర్ధం చేసుకోవాలి. అటువంటి విచిత్రాలెన్నింటినో మనం చూస్తున్నాం. తాజాగా రెండు జాతుల జీవాల మధ్య స్నేహం ఇలానే ఆకట్టుకుంది.

 

 

 

ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం శివారులో గొర్రెల మంద వెళ్తుండగా అటుగా వెళ్లే కోతి ఓ పొట్టేలుపై కూర్చొంది. ఈ దృశ్యాన్ని కొంతమంది ఫోటో తీసి నెట్టింట్లో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. ఈ జీవాల మధ్య ఉన్న స్నేహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈమధ్య పట్టణాలు, పల్లెల్లో కోతులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. మనుషులతో పాటు అవి కూడా కనిపిస్తున్నాయి. మనుషులు వీటిని చూసి కంగారుపడే వారు ఉన్నారు. వాటికి అరటిపండ్లు, ఆహారం పెట్టేవారూ ఉన్నారు. ఇవన్నీ అడవుల్లో చెట్ల సంఖ్య తగ్గిపోతుండడంతో ఆహారం కోసం జనావాసాల వైపు వస్తున్నాయి. దీంతో కొన్ని చిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి. జాతుల మధ్య వైరుధ్యం తగ్గుతోందని ఈ చిత్రంలో కోతి-పొట్టేలు నిరూపిస్తున్నాయి. చూపరులను ఈ దృశ్యం ఎంతో కనువిందు చేసింది.

 

 

 

కుక్క-పిల్లి మధ్య వైరం తెలిసిందే. కానీ ఓ పిల్లి పిల్లకు కుక్క పాలివ్వటం చూశాం. అలానే పిల్లి-ఎలుక కలిసున్న ఫోటోలను కూడా మనం చూశాం. ఇలాంటివి ప్రకృతిలో సహజంగా జరుగుతున్నాయి. ఈరోజుల్లో మనుషుల్లో పెరిగిపోతున్న హింసా ప్రవృత్తి మానవత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. మనుషుల మధ్య పెరిగిపోతున్న దూరం ఈ మూగజీవాలు తమ చర్యలను ఉదాహరణగా చూపిస్తున్నాయనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: