మూవీ టికెట్లపై జీఎస్టీ కౌన్సిల్‌ పన్ను రేటు తగ్గింపును ప్రకటించినా అందుకు అనుగుణంగా సినిమా టికెట్ల ధరలను తగ్గించలేదని పీవీఆర్‌ సినిమాస్‌, సినిపొలిస్‌ థియేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ప్ర‌స్తుతం ఈ ఆరోప‌ణ‌లు పీవీఆర్‌, సినీపోలిస్ గ్రూపు థియేట‌ర్ల‌పై అధికంగా ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల‌కు సంబంధించిన థియేట‌ర్లపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో రంగంలోకి దిగిన యాంటీ ప్రాఫిటీరింగ్‌ అథారిటీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. 


ఈ రెండు మల్టీప్లెక్స్‌ సంస్థలు పన్ను తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు మళ్లించలేదని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దేశ‌వ్యాప్తంగా ప‌లువురు సినిమా అభిమానుల నుంచి ఈ త‌ర‌హా ఫిర్యాదులు ఎక్కువుగా రావ‌డంతో ఇప్పుడు అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పీవీఆర్‌ థియేటర్లలో సింబా మూవీ టికెట్ల ధరలను తగ్గించలేదని, ఢిల్లీలోని సాకేత్‌లో సినీపొలిస్‌పై కూడా ఇదే తరహా ఫిర్యాదు అందినట్టు అధికారులు తెలిపారు. 


ఈ రెండు గ్రూపుల‌లో ఉన్న థియేట‌ర్లో దేశం అంతా ఇదే విధ‌మైన దోపిడీ కంటిన్యూ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇటీవ‌ల మాల్స్ థియేట‌ర్లు ఎక్కువ అవుతుండ‌డంతో వాళ్ల‌పై కంట్రోలింగ్ త‌క్కువుగా ఉండ‌డంతో వాళ్లు ఆడిందే ఆట పాడిందే పాట అవుతోంది. వినోదం కోసం సినిమాకు వ‌స్తోన్న ప్రేక్ష‌కుల‌పై భారం ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో రూ.100కిపైగా ఉన్న సినిమా టిక్కెట్ల‌పై జీఎస్టీని 28 శాతం పన్ను శ్లాబు నుంచి 18 శాతం పన్ను శ్లాబుకు మార్చారు. 


రూ.100 కంటే త‌క్కువ టిక్కెట్ రేటు ఉంటే జీఎస్టీ శ్లాబును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఈ జ‌న‌వ‌రి నుంచి ఈ రేట్లు అందుబాటులోకి వ‌చ్చినా ఈ రెండు మ‌ల్టీఫ్లెక్స్ థియేట‌ర్ల‌లో మాత్రం రేట్లు త‌గ్గించ‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ రెండు సంస్థ‌లు ఎంతమేర లబ్ధిపొందాయో లెక్కగట్టి అందులో కొంత మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమచేస్తామని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: