తమిళ స్టార్ హీరో విశాల్  సేవా పన్ను కేసులో బుధవారం చెన్నై, ఎగ్మూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు కావడంతో అతడిపై ఉన్న వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది.  హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన విశాల్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.  తాను హీరోగా ఉన్న సమయంలోనే నడిఘర్ సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు. అప్పటి నుంచి ఆయనపై ఎన్నో ఆరోపణలు, ఛిత్కారాలు మొదలయ్యాయి. 

తమిళనాట చిన్న సినిమాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని..పెద్ద సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాలకు థియేటర్లు కరువయ్యే పరిస్థితి నెలకొందని, ఇందుకు ఆయన బాధ్యత వహించాలని చిన్న నిర్మాతల సంఘం వారు ఎన్నో ఆరోపణలు చేశారు.  ఈ విషయంలో విశాలపై పోలీసు కేసు కూడా పెట్టారు.  ఈ గొడవ సర్ధమణగ ముందే..విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో విశాల్ సినీ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ నుంచి జరిగే చెల్లింపుల్లో టీడీఎస్ మినహాయించుకున్నప్పటికీ ఆ సొమ్మును ఆదాయ పన్ను శాఖకు నిర్ణీత సమయంలో చెల్లించడంలో విశాల్ విఫలమయ్యాడు.

మొత్తం నాలుగు కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉండడంతో ఆదాయపు పన్ను శాఖ విశాల్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. కానీ విశాల్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎగ్మూరులోని ఆర్థిక నేరాలపై విచారణ జరిపే కోర్టును ఆశ్రయించారు.  దాంతో కోర్టు సీరియస్ కావడం..కేసు విచారణ సందర్భంగా విశాల్ నేరుగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

మంగళవారం జరిగిన విచారణకు కూడా విశాల్ హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  వెంటనే అలర్ట్ అయిన విశాల్  బుధవారం విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. రెండు గంటలకు పైగా విశాల్ కోర్టులో వేచి ఉన్నాడు. దీంతో అతడిపై ఉన్న వారెంట్‌ను కోర్టు ఉపసంహరించుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: