యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సాహో`. రూ.350కోట్ల‌తో సుజిత్ దర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తెలుగు స‌హా హిందీ, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చింది. అయితే సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు వ‌సూళ్లు వ‌చ్చాయి. 


ట్రేడ్ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం సాహోకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.104.8 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. తెలంగాణ‌లో రూ.14.1కోట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.42.2 కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ.13.9కోట్లు, త‌మిళ‌నాడు రూ.3.8కోట్లు, కేర‌ళ రూ.1.2 కోట్లు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక బాలీవుడ్‌లో చూస్తే తొలి రోజు హిందీ వెర్ష‌న్ 29.6 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సినిమా సాధించింది. 


రూ. 104 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌లో షేర్ క‌లెక్ష‌న్స్ ప్ర‌కారం చూస్తే సినిమాకు రూ. 68.1 కోట్ల వ‌చ్చాయ‌ని తెలిసింది. ఇక ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.333 కోట్ల‌కు అమ్మారు. తొలి రోజు రూ.68 కోట్ల షేర్ అంటే ఇంకా రూ. 253 కోట్ల షేర్ కొల్ల‌గొట్టాల్సి ఉంది. ఈ డివైడ్ టాక్‌తో అంత టార్గెట్‌ను సాహో ఎంత వ‌ర‌కు చేధిస్తుందో ?  చూడాలి.  ఇంత నెగిటివ్ టాక్‌తో కూడా ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు. 


టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించాడు. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తో నడిచిన సాహో చిత్రం ఈ మాత్రం వసూళ్లు సాధించడం అనేది ప్రభాస్ పాపులారిటీ తెలియజేస్తుంది. అయితే తొలి రోజు క‌లెక్ష‌న్ల‌లో బుకింగ్స్ వలన వచ్చిన వసూళ్లు ఎక్కువ‌. రెండవ రోజునుండి పరిస్థితి వేరుగా ఉంటుందని కొందరివాదన. మరి సాహో అసలు సత్తా తెలియాలంటే నిజంగా ఈ వీకెండ్ ముగియాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: