సాధారణంగా సినిమా హీరోలు షూటింగ్ అయ్యిందా..ఇంటికి వెళ్లామా తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేశామా అన్న రీతిలో ఉంటారు.  కానీ కొంత మంది తమ చుట్టూ ఉన్నవారి శ్రేయస్సు చూసుకుంటారు.  అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానుల విషయంలో చాలా సంస్కారం చూపిస్తుంటారు. అంతే కాదు తనకు సినీ పరిశ్రమలో చేయూతనిచ్చినవారికి, అంతేందుకు తన మేకప్ మాన్, డ్రైవర్ కి కూడా ఇలా తనకు ఆత్మీయులందరికీ సహాయం చేశారు. 

రజినీకాంత్ మొదట్లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత హీరోగా తన సత్తా చాటుతూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. రజనీకాంత్ సోలో హీరోగా నటించిన ఫస్ట్ సినిమా ‘భైరవి’ను (1978) కలైజ్ఞానం నిర్మించారు.  ‘భైరవి’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని పలు సందర్భాల్లో రజనీ చెప్పారు. తన కెరీర్ ఉన్నత స్థానం రావడానికి ‘భైరవి’ ఎంతో దోహదపడిందని పలు సందర్భాల్లో అన్నారు. 

ఈ మద్య కలైజ్ఞానం సన్మాన సభ జరిగింది. ఇందులో రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్‌ వేదికపై మాట్లాడుతూ.. “కలైజ్ఞానం ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారని, ఆయన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.  దానికి రజికాంత్ స్పందించి తనకు మంచి లైఫ్ ఇచ్చిన కలైజ్ఞానం పరిస్థితి అలా ఉందని తాను ఎప్పుడూ అనుకోలేదని.. ‘నేను ఇల్లు కొనిస్తాను.

ఈ అవకాశాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వను. త్వరలోనే కలైజ్ఞానంకు సొంత ఇల్లు ఉంటుంది. అది కూడా పదిరోజుల్లో ఆయన ఇల్లు చేతులో పెడతా అని అన్నారు.  ఇచ్చిన మాట ప్రకారం రూ.కోటి విలువ చేసే ఇల్లును కొని కానుకగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పనుల్ని భారతీరాజా చూసుకున్నారని.. వార్తలు వస్తున్నాయి.  కాకపోతే ఈ విషయంపై రజనీ, కలైజ్ఞానం అఫిషియల్ గా స్పందించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: