హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికి ఎదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. దానికి అనుగుణంగా అనేక పూజలు వ్రతాలు పండుగలు ఏర్పడ్డాయి అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయకచవితి. ఏ పని ప్రారంభించినా తొలిపూజ వినాయకుడికి చేయకుండా ఆపూజ పూర్తి అవ్వదు. అలాంటి సిద్ధి వినాయకుడుని ఆరాధించే వినాయకచవితి భాద్రపద శుద్ధ చవితి రోజన వస్తుంది. ఈరోజు విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు గణాధిపత్యం పొందిన రోజని మరికొందరు భావిస్తారు. బ్రహ్మ ప్రప్రధమంగా సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన ఘంటకుడిగా వినాయకుడిని పెట్టుకున్నాడు. 

ఈ మహాగణపతిని రకరకాలుగా పూజిస్తారు. హరిద్రా గణపతి స్వర్ణ గణపతి ఉచ్చిష్ట గణపతి సంతాన గణపతి నవనీత గణపతి అని వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ వినాయకచవితిని తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాలలో జరుపుకుంటూ ఉంటారు. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుని భావిస్తారు. అంతేకాదు విజయానికి మారుపేరుగా గణపతిని ఆరాధిస్తారు. పార్వతీపరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు ఈరోజు కైలాసం నుండి భూమి మీదకు వచ్చి ప్రతిఇంటికి వెళ్ళి అందరి పూజలు అందుకుంటాడని నమ్మకం.  

వాస్తవానికి ఈ వినాయకచవితి సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమయిందో ఎవరికీ సరైన అవగాహన లేనప్పటికీ మహారాష్ట్రలో శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు పాలనలో ఈ వేడుకలు ప్రాముఖ్యతను సంతరించుకుని స్వాతంత్రోద్యమ సమయంలో గోపాలకృష్ణ గోఖిలే నేతృత్వంలో మహారాష్ట్రలోని పూణేలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా ఆరోజులలో స్వాతంత్రోద్యమ స్పూర్తిని అప్పటి జనంలో కలిగించారు. వినాయక చవితిరోజున వినాయకుడి సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకుని వచ్చి ఈ ప్రతిమను పది రోజుల పాటు పూజించడం ఒక ఆనవాయితి. 

ఈ చవితిరోజున వినాయకుడు కి ఇష్టమైన కుడుములు మోదకం మరియు లడ్డు వంటి పలురకాల పిండి వంటలను సిద్ధం చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈవిధంగా గణపతిని పదిరోజుల తరువాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా కులమత విచక్షణ లేకుండా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుని విగ్రహాలను తీసుకుని వెళ్ళి  సముద్రంలో లేదా నదిలో నిమజ్జనం చేయడం అద్భుత దృశ్యంగా అనిపిస్తుంది. సృష్టి స్థితి కారకుడైన బ్రహ్మ దగ్గర నుండి అతి సామాన్యుడితో కూడ పూజలు అందుకునే వినాయక రూపాలను రకరకాలుగా తయారుచేయడం ఈ గణపతి నవరాత్రుల మహోత్సవాలలో ప్రత్యేకత. ఈరోజు పూజలు అందుకుంటున్న వినాయకుడు అందరికీ విఘ్నాలు తొలగించి అందరికీ విజయం కలిగించాలని ఆకాంక్షిస్తూ ఇండియన్ హెరాల్డ్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: