గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా సినిమాలకు సంబంధించినంత వరకు సాహో తప్ప మరో టాపిక్, టాక్ వినిపించడం లేదు. మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందినట్టుగా చెప్పుకుంటు అంతకు రెట్టింపు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహోకు ప్రేక్షకులు నిర్మొహమాటంగా తమ తీర్పును చెప్పేశారు. మొదటి షో నుండే యావరేజ్, బాలేదు అనే మిక్స్డ్ టాక్, డివైడ్ టాక్ బాగా వినిపించింది. అయినా మెల్లగా అనుకున్నంత కలెక్షన్లను లాక్కొస్తోంది. వీకెండ్ నాలుగు రోజులు రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో కాని మొత్తానికి పండగ సెలవులు బాగా ప్లస్ అయ్యాయి. ఇదిలా ఉండగా సాహో ఫెయిల్యూర్ కు అందరి వేళ్ళు సుజిత్ వైపే వెళ్తున్నాయి. డైరెక్టర్ దే తప్పంతా..సరైన అనుభవం లేని ఇతను ఇంత బడ్జెట్ పెట్టించాడని అంటున్నారు. కాని నిజానికి ఇందులో అందరి బాద్యత ఉందని ఒప్పుకోక తప్పదు.

వాస్తవంగా చెప్పాలంటే సుజిత్ ముందు ఈ కథ అనుకున్నప్పుడు కేవలం 50 నుంచి 60 కోట్ల మధ్యలో బడ్జెట్ చెప్పాడట. ఈ విషయం చాలాసార్లు చర్చకు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కాని అప్పటికి బాహుబలి 2 విడుదల కాలేదు. కాని దాని ఫలితం చూశాక ప్రభాస్ రేంజ్ ఈ లెవెల్ లో పెరిగిపోవడం చూసి సాహోని ఇంకాస్త పెంచాలనే ఉద్దేశంతో యువి టీం.. సుజిత్ ని కనీసం ఓ నూటా యాభై కోట్లకు సరిపడా కాన్వాస్ కు ఇదే కథను మార్పులు చేయమని కోరారట. 

దాంతో నిర్మాతలే స్వయంగా బడ్జెట్ పెంచమన్నారు కాబట్టి సుజిత్ ఎంతో రిస్క్ చేసి మరీ కోట్ల రూపాయల ఖర్చు డిమాండ్ చేసే ఎపిసోడ్స్ ప్లాన్ చేశాడు. పోనీ ఇదంతా చూసి ప్రభాస్ అయినా ఎందుకు ఇంత బడ్జెట్ అని గట్టిగా అడ్డు చెప్పే ప్రయత్నం చేసుంటే కథ వేరేలా ఉండేదేమో. తనకు చెప్పింది చేయడానికి మాత్రమే పరిమితమైన ప్రభాస్ చొరవ తీసుకోకపోవడం కూడా సాహో పాలిట శాపంగా మారి ఉండొచ్చని ఫిల్మ్ నగర్ లో సినిమా రిజల్ట్ చూసిన అందరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు బాధ్యులు అయితేనేం మొత్తానికి సాహో నిరాశపరిచి భారీ బడ్జెట్ ల సినిమాలకు ఒక హెచ్చరికలా మిగిలిపోయిందికాకపోతే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే సేఫేనని చిన్న నమ్మకం అయితే కలుగుతోంది. మరి మంగళవారం నుండి పరిస్థితేంటో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: