ఇప్పుడంద‌రూ అడివి శేష్‌ను ఆహా ఓహో అని పొగిడేస్తున్నారు. కానీ నాలుగైదేళ్ల ముందు అత‌డిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కెరీర్ ఆరంభంలో హీరోగా అత‌ను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన క‌ర్మ‌, కిస్ సినిమాలు డిజాస్ట‌ర్ల‌య్యాయి. ఆ త‌ర్వాత విల‌న్ పాత్ర చేసిన పంజా సినిమా కూడా ఫ్లాప్ అయింది. మిగ‌తా సినిమాలు పెద్ద‌గా పేరు తేలేదు. 


అలాంటి స్థితిలో శేష్‌ను న‌మ్మి బాహుబ‌లి లాంటి మెగా ప్రాజెక్టులో అత‌డికి అవ‌కాశం ఇచ్చి కెరీర్‌ను మ‌లుపు తిప్పిన ఘ‌న‌త రాజ‌మౌళిదే. ఈ చిత్రంలో శేష్ భ‌ద్రుడి పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చేస్తుండ‌గానే అత‌డికి క్ష‌ణంలో అవ‌కాశం వ‌చ్చింది. ఆ సినిమా త‌ర్వాత అత‌ను వెనుదిరిగి చూసుకున్న‌ది లేదు. అయితే రాజ‌మౌళి త‌న‌కు ఎలా అవ‌కాశ‌మిచ్చాడో శేష్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.


''పంజా' తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెళ్లుంటే అంతగా ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ హీరోగా కిస్ సినిమా చేసి దారుణంగా దెబ్బ తిన్నా. అప్పుల పాల‌య్యా. ఆ త‌ర్వాత ఓసారి నిర్మాత ప్రసాద్‌ దేవినేనిగారి పుట్టినరోజు వేడుక‌కు వెళ్లాను. అక్క‌డ నేను చేసిన డాన్స్‌ బావుందని స్వయంగా రాజమౌళి గారు దగ్గరికొచ్చి చెప్పారు. 'ఈగ' తర్వాత ఆయ‌న పెద్ద ఎపిక్‌ మూవీ ఏదో చేస్తున్నారని తెలిసి క‌లిశాను.


నేరుగా నాకు అవ‌కాశం కావాల‌ని అడిగేశా. ఈ సినిమాలో కాఫీ కప్పు పట్టుకుని నడిచే జూనియర్ ఆర్టిస్టుగా చేయ‌మ‌న్నా రెడీ అని చెప్పా. మనం అందరిలాగే అడిగాం.. ఆయన అందరికీ చెప్పినట్లే ఓకే అన్నారు అనుకున్నా. కానీ ఏడాది తర్వాత ఫోన్‌ చేసి భద్రుడు క్యారెక్టర్‌ చేయమని చెప్పారు. 'కిస్‌' ఫ్లాప్‌ అయిన వారం తర్వాత 'బాహుబలి' షూట్‌ మొదలైంది. అప్పటికీ చాలా డ్రిపెషన్‌లో ఉన్న నన్ను 'బాహుబలి' సినిమా మామూలు స్థితికి తీసుకొచ్చింది. అప్పుడే 'క్షణం' కథ రాశా. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూసుకోలేదు'' అని శేష్ చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: