సినీ రంగంలో ఉన్నవారికి ప్రేక్షకుల చప్పట్లే ఊపిరి.. వారు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ప్రేక్షకుల గుండెల్లో స్థానమే కోరుకుంటారు. అలాగే వారికి మరింత ప్రోత్సాహాన్నిచ్చేది అవార్డులు.. అందులోనూ ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డులకు చాలా విలువ, గుర్తింపు ఉంటాయి. కానీ కొన్నేళ్లుగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రదేశ్ రెండూ ఈ అవార్డులు సరిగ్గా సమయానికి ప్రకటించడం లేదు.


ఈ అంశంపై సీనియర్ నటి జయసుధ తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేసారు. ఆమె ఏమన్నారంటే..

“ అవార్డు అనేది మనం చేసిన పనికి గుర్తింపు. కొన్ని అవార్డులు ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నంది అవార్డులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రముఖులకు కలైమామణి అవార్డు ఇస్తూ వస్తోంది. వాళ్లు దాన్ని బాగా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఏ పేరుతో ఇస్తారో.. ఇవ్వాలి. వాళ్లే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా?


" అవార్డులు రాకపోయినా ఫర్వాలేదని అంటుంటాం కానీ, అవార్డులు వస్తే మనసులో సంతోషంగా అనిపిస్తుంది. మేం చాలా కార్యక్రమాలకు వస్తుంటాం. సోషల్ వర్క్‌కు రావాలంటే వస్తాం. అలాంటి మమ్మల్ని గుర్తించి అవార్డులిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల నవ తరానికి కూడా అవార్డు విలువ తెలుస్తుంది. ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా సుబ్బరామిరెడ్డి గారు ఆయన బర్త్‌డేకి అవార్డులు ఇస్తుంటారు. 20 ఏళ్ల నుంచీ నిర్విరామంగా ఆయన అవార్డులు ఇస్తుండటం చాలా గొప్ప విషయం" అని ఆమె జయసుధ అన్నారు.


నిజంగానే జయసుధ చెప్పిన విషయంలో అర్థం ఉంది. ప్రభుత్వం నటీనటులను ప్రోత్సహించాలి. అప్పుడే సినీ ఇండస్ట్రీలో కాస్త ఉత్సాహం ఉంటుంది. సినీపరిశ్రమ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోంది. ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. మరి ఈ రంగాన్ని అంతగా నిర్లక్ష్యం చేస్తే ఎలా..?


మరింత సమాచారం తెలుసుకోండి: