అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున తర్వాత ఆ ఫ్యామిలి నుండి మళ్ళీ కొంత పాపులారిటి తెచ్చుకున్న హీరో నాగచైతన్య. నాగార్జున లాగే చైతు కెరీర్ కూడా కాస్త నెమ్మదిగానే సాగింది. హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. అయినా మార్కెట్ మాత్రం బాగానే ఉంది. ఇక చైతూ.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే తను వెనక్కి తిరిగి చూసుకుంటే 13 ఫ్లాపులు కనిపిస్తాయి. వీటిలో దారుణమైన డిజాస్టర్లు గట్టిగానే వున్నాయి. తొలి సినిమా జోష్ తో పరాజయాల బోణీ ప్రారంభమైంది. ఏమాయ చేసావె, 100% లవ్ ఓకె అనుకుంటే.. దడ, బెజవాడ ఎంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయో అందరికి తెలిసిందే. ఆ తరువాత తడాఖా ఓకె. మనం మంచి సినిమాగా అక్కినేని ఫ్యామిలి మొత్తానికి జీవితాంతం ఒక తీపి గుర్తుగా నిలిచిపోతుంది.

ఇక ఆటోనగర్ సూర్య, ఒకలైలా కోసం, దోచేయ్ వచ్చాయి. వీటిలో ఆటోనగర్, దోచేయ్ సినిమాలు ఫ్లాపుల్లో అద్భుతమైన కళాఖండాలుగా మిగిలిపోయాయనడానికి చక్కటి ఉదాహరణలు. ఈ సినిమాల తర్వాత ప్రేమమ్ సినిమా కాస్త ఊరట ఇచ్చింది అనుకునేలోగా, సాహసం శ్వాసగా సాగిపో అంటూ మళ్లీ ప్లాపు పడింది. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ హిట్ కొట్టగానే యుద్ధం శరణం అంటూ డిజాస్టర్ వచ్చి ఒళ్ళో పడింది. శైలజరెడ్డి అల్లుడు యావరేజ్ అనుకంటుంటే, సవ్యసాచి అంటూ డిజాస్టర్ వచ్చి చైతూని కిందకి లాగింది. ఆ తరువాత మజిలీతో మళ్లీ ఊరట. బాగా గమనిస్తే ఇదీ మన అక్కినేని నాగచైతన్య కెరీర్ గ్రాఫ్.

ఈ ఫ్లాపులు, హిట్ ల ను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అదేంటంటే నాగచైతన్యకు మాస్ సినిమాలు, యాక్షన్ జోనర్లు అస్సలు పనికిరావు. చక్కగా ఫ్యామిలీ టచ్ వున్న సినిమాలు చేసుకుంటే కనీసం యావరేజ్ అని అయినా అనిపించుకుంటాయి. కానీ సమస్య ఏమిటంటే, యాక్షన్ డ్రామా కథ చెబితేచాలు చైతన్య ఎగ్జయిట్ అయిపోతాడని ఇండస్ట్రీ టాక్. మాస్ యాక్షన్ హీరో అనిపించుకోవాలని చైతూ తాపత్రయం. కానీ జనాలు మాత్రం చైతూ ని ఫ్యామిలీ హీరోగానే చూస్తామంటున్నారు.
మరి పదేళ్ల అనుభవంతో చైతూ ఇప్పటి నుంచైనా చక్కటి ప్రేమకథా, ఫ్యామిలీ సినిమాలు ఒప్పుకొని ప్రేక్షకులను తృప్తి పరిస్తే బావుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: