సాహో సినిమాకు దాదాపు అన్ని భాషల్లోనూ రివ్యూలు చాలా దారుణంగా వచ్చాయి. కొన్ని పత్రికలు, వెబ్ సైట్లు, ఛానళ్లయితే 0.5 రేటింగ్ కూడా ఇచ్చాయి. చాలా మంది సమీక్షకులు ఈ సినిమా వేస్ట్ అంటూ కామెంట్ చేశారు. అయితే సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత దర్శకుడు సుజీత్ కామెంట్ చేశాడు. బహుశా సినిమా వాళ్లకు అర్థం కాలేదేమో అంటూ సందేహం వెలిబుచ్చాడు.


తొలి రోజు ప్రభాస్‌ సినిమా అంటే ఆ అరుపులు, గోల ఎలా ఉంటుందో తెలిసిందే... ఆ గోల మధ్య సినిమా చూసినవాళ్లకు ఏం అర్థం అయ్యిందో, ఎంత వరకూ అర్థమైందో తనకు తెలీదన్నాడు సుజీత్ . అందుకే రివ్యూలు అటూ ఇటుగా వచ్చాయని.. . కానీ ప్రేక్షకుల స్పందన మాత్రం వేరే స్థాయిలో ఉందని సుజీత్ అంటున్నాడు. మన కష్టం ఎక్కడికీ పోదన్న విషయం మరోసారి నాకు అర్థమైందని కామెంట్ చేస్తున్నాడు..


అలాగని తనకు విమర్శకులపై కోపం లేదట.. పైగా గౌరవం కూడానట. ‘రన్‌ రాజా రన్‌’ సమయంలో సినిమా చూసి అందరూ ‘బాగుందంటుంటే... మీరు చెప్పడం కాదు, రివ్యూ వచ్చేంత వరకూ ఆగండి అని అన్న విషయాన్ని సుజీత్ గుర్తు చేసుకుంటున్నాడు. సమీక్షలో బాగుందని మెచ్చుకున్న తర్వాతే తనకు హిట్టు కొట్టిన సంతోషం కలిగిందట.


విమర్శకులు వాళ్ల పని వాళ్లు చేశారంటున్న సుజీత్.. ‘సాహో’ వంటి పెద్ద సినిమాలకు తొందరపడకుండా ఓ పూట ఆగి రివ్యూలు ఇవ్వాలని సూచిస్తున్నాడు. ప్రేక్షకులకు ఆలోచించుకునే సమయం ఇస్తే బాగుంటుందట. రివ్యూల ప్రభావం ప్రేక్షకులపై తప్పకుండా ఉంటుందంటున్నాడు సుజీత్. సినిమా టైమ్, వచ్చిపోయే టైమ్.. మొత్తం నాలుగైదు గంటల సమయం సినిమాకి ఇవ్వాలా? వద్దా? అనే విషయం రివ్యూలు చూసే జనం నిర్ణయించుకుంటున్నారని సుజీత్ అభిప్రాయపడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: