చాలా రోజుల తర్వాత సాహో దర్శకుడు సుజీత్ మీడియా ముందుకు వస్తున్నాడు. సాహో సినిమాకు రివ్యూలు చాలా దారుణంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు కూడా నిరుత్సాహపడ్డ సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా కలెక్షన్లు మాత్రం సినిమాకు టాక్ వచ్చిన రీతిలో లేవు.


వేరే ఏదైనా సినిమాకు ఈ స్థాయిలో రివ్యూలు వచ్చి ఉంటే.. ఆ సినిమా డిజాస్టర్ అయ్యుండేది..కానీ సాహోకు మాత్రం టాక్ తో పోలిస్తే వచ్చిన కలెక్షన్లు బాగానే వచ్చినట్టు లెక్క. దీనిపై దర్శకుడు సుజీత్ స్పందించాడు. అసలు సినిమాను సరిగ్గా అర్థం చేసుకోలేదని ఇంకా ఆయన వాదిస్తున్నాడు.


కొంతమంది ఈ కథకి అర్థం లేదన్నారని.... అర్థం కాకపోవడానికీ, అర్థం లేకపోవడానికీ చాలా తేడా ఉందని సుజీత్ అంటున్నాడు. అర్థం కాలేదంటే మళ్లీ చూడాలని.. అలాంటప్పుడు అర్థం లేదని రాయడం తప్పని చెబుతున్నాడు. అంతే కాదు.. మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులపై రుద్దేయడం ఇంకా తప్పు అని వాదిస్తున్నాడు.


అసలు తాను బీహార్లో పుట్టి ఉంటే తనకు సాహో సినిమా తీసినందుకు గుడి కట్టేవారే అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే.. సాహో సినిమా చూసిబీహార్‌ నుంచి చాలా మంది సుజీత్ కు ఫోన్లు చేసి అభినందిస్తున్నారట. ఒకాయన.. బీహార్‌లో పుట్టి ఉంటే మీకు గుడి కట్టేసేవారు అని మెచ్చుకున్నారట. ఇంకో తెలుగు కుర్రాడేమో పాన్‌ ఇండియా సినిమా తీస్తే.. మన వాళ్లు గుర్తించడం లేదు అని తెగ బాధపడ్డాడట..


ఏదేమైనా ఈ సినిమా గురించి ఎవరేమన్నా ప్రేక్షకులకు మాత్రం చాలా బాగా నచ్చిందట. వాళ్లు ఈ సినిమాని నెత్తిమీద పెట్టుకున్నారట. లేకపోతే ఇంత గొప్పగా కలెక్షన్లు ఎలా వస్తాయని ఎదురు ప్రశ్నిస్తున్నాడు సుజీత్. మొత్తం మీద మా సినిమా అర్థం కాకపోతే అది మీ తప్పు నాదెలా అవుతుంది అని వాదిస్తున్నాడీ కుర్ర దర్శకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: