ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా గత శుక్రవారం విడుదలైంది. బాహుబలి, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్ల తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావటంతో విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజైన రోజున ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ప్రేక్షకులకు సాహో సినిమా బాగానే నచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంలో మాత్రం సాహో సినిమా విఫలమయింది. 
 
బాలీవుడ్లో కూడా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సాహో సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. విడుదలైన 5 రోజుల్లోనే బాలీవుడ్ లో ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా మొదటి వారంలో 75 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. బయ్యర్లు పెట్టిన పెట్టుబడితో పోలిస్తే మరో 50 కోట్ల రుపాయలు సాహో సినిమా వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం సాహో సినిమాకు రోజురోజుకు తగ్గుతున్న కలెక్షన్లను చూస్తే మాత్రం 100 కోట్ల రుపాయల షేర్ వసూలు చేస్తుందా అంటే కూడా అనుమానమే. 
 
సాహో సినిమాకు ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే ఈ సినిమాకు రిపీట్ ఆడియెన్స్ లేకపోవటం. మగధీర, బాహుబలి, బాహుబలి 2 సినిమాలకు రిపీట్ ఆడియెన్స్ వలనే రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. కానీ సాహో మొదటిసారి చూసినవారికే నచ్చకపోవటంతో రిపీట్ ఆడియెన్స్ లేరు. మరోవైపు తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ లో సాహో సినిమా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ మూడు ప్రాంతాలలో మాత్రం సాహో సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు తప్పటం లేదు. 
 
సాహో సినిమా ఫలితం నేపథ్యంలో ప్రభాస్ ఇకముందైనా కథల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం అన్ని ప్రాంతాలలో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తుందనటంలో సందేహం లేదు. వరుసగా ప్లాపులు ఇస్తే ప్రభాస్ మార్కెట్ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్నాడు. సాహో సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ ఈ సినిమాను కూడా నిర్మిస్తూ ఉండటం విశేషం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: