కొంతమంది దర్శకులుగా బాగా పాపులర్ అయ్యాక అలానే కంటిన్యూ అవకుండా నిర్మాతగాను మారతారు. అంతవరకు బాగానే ఉంటుంది. కాని నిర్మాతగా మారాకే చేతులు  కాల్చుకొని దర్శకుడిగాను సక్సస్ లను పోగొట్టుకుంటారు. ఇందుకు పెద్ద ఉదాహరణలు తెలుగులో పూరి జగన్నాధ్, తమిళంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్. తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న గౌతమ్ మీనన్... తమిళంతో పాటు తెలుగులో ఎన్నో హిట్స్.. సూపర్ హిట్స్ ఇచ్చిన స్టార్ దర్శకుడు. అంతటి సక్సెస్ లను అందుకున్న ఈ దర్శకుడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గౌతం దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన 'ఎన్నై నొక్కి పాయుంతోట' సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సింది. కాని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మధ్యవర్తుల సహకారంతో ఫైనాన్షియర్స్,  గౌతమ్ మీనన్ రాజీకి రావడంతో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా అయ్యాయి. సినిమా ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో అనుకోకుండా సినిమా విడుదలపై కొందరు ఫైనాన్షియర్స్ స్టే తీసుకు వచ్చారు. ఆ సినిమా పరిస్థితి అలా ఉంటే మరో స్టార్ హీరో విక్రమ్ తో తీసిన 'ధృవ నక్షత్రం' సినిమా కూడా విడుదల కావడం లేదు. ఆ సినిమా విడుదల విషయంలో కూడా ఆర్ధిక పరిస్థితులు గౌతమ్ మీనన్ ను చిక్కుల్లో పడేశాయి. ఒకప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా అంటే తెలుగు తో పాటు తమిళ హీరోలు ఎంతో మంది ఆసక్తి చూపించే వాళ్ళు. కాని ఇప్పుడు స్టార్ హీరోలతో తీసిన సినిమాలు కూడా విడుదలకు నోచుకోవడం లేదు. 

ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితికి ఆయనే కారణం అంటూ తమిళ సినీ పరిశ్రమలో కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. దర్శకుడిగా మంచి జోరు మీదున్న సమయంలో నిర్మాణంలోకి అడుగు పెట్టడం అనేది తప్పుడు నిర్ణయమని ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ ది తప్పుడు నిర్ణయం అని తన రెండు సినిమాలకే అర్థం కావాలి. కాని ఆయన మళ్లీ మళ్లీ అదే తప్పు చేశాడు. దాంతో ఆర్థికంగా చాలా కష్టాల్లో ఇరుక్కు పోయాడు. నిర్మాతగా నష్టపోవడంతో దర్శకుడిగా కూడా క్రేజ్ తగ్గింది. మళ్లీ గౌతమ్ మీనన్ మళ్ళీ ఫాం లోకి రావాలి అంటూ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఆయన మాత్రం ఇంకా నిర్మాణ బాధ్యతల నుండి బయట పడలేక పోతున్నాడు. ఇప్పటి నుంచైనా కేవలం దర్శకత్వం మీదే దృష్టి పెడితే బావుంటుందేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: