తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా నందమూరిని, అక్కినేనిని చెప్పుకుంటారు. ఆ ఇద్దరూ తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పారని కూడ చెబుతారు. దశాబ్దాల పాటు టాలీవుడ్ ని శాసించి ఇదీ మా సత్తా అని లోకానికి చూపించారు. అంతే కాదు, తెలుగు సినిమా నాణ్యతను పెంచారు, కాసుల గలగలలనూ పెంచారు. భారత దేశంలో తెలుగు సినిమాకు ఒక స్థానం ఏర్పాటు చేశారు. ఓ విధంగా ఆ ఇద్దరిదీ స్వర్ణయుగంగా చెప్పాలి.


మరి అటువంటి అగ్రనటులు ఇద్దరినీ ధిక్కరించి నిలబడగలిగిన వారు ఉన్నారా అంటే ఉన్నారు కొంతమంది. అందులో ముందు వరసలో ఉన్న నటీమణి భానుమతి. ఆమె ఈ ఇద్దరు అగ్ర నటుల కంటే ముందు అంటే 1935 ప్రాంతంలోనే సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత 1941 ప్రాంతంలో నాగేశ్వరరావు, 1949 ప్రాంతంలో నందమూరి తారకరామారావు వచ్చారు. ఓ విధంగా భానుమతి కంటే వారిద్దరూ జూనియర్లు.


ఆ రోజులో సీనియారిటీ బట్టి తెర మీద తారగణం పేర్లు వేసేవారు. అల భానుమతి పేరు ముందు వేస్తే తరువాత ఈ ఇద్దరి నటుల పేర్లు కనిపించేవి. ఇక భానుమతి ఈ ఇద్దరితో కూడా చాలా సినిమాలు చేశారు. హీరోయిన్ గానే  కాదు క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా ఇద్దరి సినిమాలో భానుమతి కనిపించి కనువిందు చేశారు.


భానుమతిని తన తోబుట్టువుగా అన్న నందమూరి చూసుకుంటే నాగేశ్వరరావు సైతం ఆమెతో మంచి అనుబంధం కలిగి ఉండేవారు. ఆమె అంటే అభిమానం అగ్ర నటులు ఇద్దరికీ ఉండేది. ఇక భానుమతి 1925 సెప్టెంబర్ 7న పుట్టారు, 2005 డిసెంబర్ 24న ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. ఆమె నటిగా, స్టూడియో అధినేతగా, రచయిత్రిగా, డైరెక్టర్ గా, గాయకురాలిగా, సంగీత దర్శకురాలిగా బహుముఖీయమైన ప్రతిభా పాటవాలతో అందరినీ ఆకట్టుకున్నారు.


ఆమెకు పద్మ అవార్డులు వచ్చాయి కానీ దాదా సాహెబ్ అవార్డ్ దక్కలేదు. అది పరిశీలనలో ఉండగానే భానుమతి పరమపదించారు. స్వాభిమానం మెండుగా ఉన్న భానుమతి సినిమాల్లో పాత్రల్లోనే కాదు నిజ జీవితంలో కూడా తనకు నచ్చినట్లుగా ఉండేవారు. తేడా వస్తే ఆమె సహించేవారు కాదు, ఆమె అహంభావి కాదు,  ఆత్మగౌరవం నిండుగా ఉన్న తెలుగు వారి ముద్దు బిడ్డ. ఈ రోజు ఆమె జయంత్రి సందర్భంగా స్మరించుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: