సినిమాల్లో అవకాశాలు రావడం చాలా కష్టం. టాలెండ్ ఉండి కూడా అవకాశాలు రాక చాలా మంది సతమతమవుతుంటారు. ఎప్పుడో వచ్చే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఒక్క ఛాన్సే తమ జీవితాల్ని మార్చి వేస్తుంది. అలా ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తారు. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పరిస్థితి కూడా అలాంటిదే. మొన్న వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస చిత్రం ఆయన కెరీర్లో పెద్ద మలుపు.
ఆ సినిమాలో నవీన్ అద్భుతమైన నటనని కనబరిచాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మౌత్ టాక్ ద్వారానే హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది.ఈ సినిమా తర్వాత తెలుగులో నవీన్‌కు రెండు మూడు మంచి అవకాశాలు వచ్చినట్లు చెబుతున్నారు. వాటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
అయితే ఇదిలా ఉంచితే నవీన్ పోలిశెట్టి హిందీ సినిమాలో కూడా కనిపించాడు. తెలుగులో ఏజెంట్ సినిమా చేస్తున్నప్పుడే నవీన్ కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వం వహించిన "చిచ్చోరే" సినిమాలో నవీన్ కి అవకాశం ఇచ్చాడు. నవీన్ పోలిశెట్టికి ఉత్తరాదిన మంచి పాపులారిటీ ఉంది. ఆయన హిందీలో చేసిన కొన్ని వెబ్ సిరీస్, వీడియోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఈ చిచ్చోరే సినిమా ద్వారా మనోడు బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఈ సినిమా కి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కాలేజీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ చాలా బాగుందని టాక్. ఈ సినిమా విజయం సాధించడంతో మనోడికి బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయి. ముందు ముందు మరిన్ని బాలీవుడ్ సినిమాలు చేయాలని కోరుకుందాం.