సాధారణంగా ప్రేక్షకులు పెద్ద సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారన్న విషయం అందరికి తెలిసిందే.  ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తేనో.. లేక సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటేనో తప్ప ప్రేక్షకులు  చిన్న సినిమాలపై  దృష్టి పెట్టరు.  సాహో హడావుడి కాస్త తగ్గింది కదా.. దీంతో ఈ వారం దాదాపు ఆరు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. జోడి'.. '2 అవర్స్ లవ్'.. 'దర్పణం'.. 'నీకోసం'.. 'ఉండిపోరాదే'..సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ప్రేక్షకులకు కాస్త తెలిసిన సినిమా జోడి మాత్రమే.  ఆది నటించిన ఈ సినిమా మీద మొదటి నుంచి అంతగా క్రేజ్ లేదు. రిలీజ్ తర్వాత సినిమాను రోటీన్ కథ అంటు వదిలేశారు. ఇక మిగతా సినిమాల పరిస్థితి మరీ దారుణం. అసలు అలాంటి సినిమాలు ఉన్నాయని ప్రేక్షకులకు తెలుసా? అంటే ప్రమోషన్స్ సరిగా చేయలేదనే విషయం అర్థమవుతుంది.  

ఒకవేళ అదే అనుకుందాం "అసలే చిన్న సినిమాలు.. ప్రమోషన్స్ అదనపు ఖర్చు కదా" అనుకోవచ్చు. మరి సోషల్ మీడియా ఉంది. పైసా ఖర్చు పెట్టకుండా ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అనే అంశాన్ని రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పద్దతులను నేర్పిస్తున్నారు కదా. తన సినిమాలకు ప్రమోషన్స్ చేసే టెక్నిక్ ను.. ప్రేక్షకుల వద్దకు తన సినిమాలను తీసుకెళ్ళే విధానాన్ని నేర్చుకోవచ్చు కదా..! లేదు. ఈవారం రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఒక్క సినిమాకు కూడా 'బాగుంది' అనే టాక్ రాలేదు.  ఎక్కడా సోషల్ మీడియాలో కనీసం చర్చ కూడా లేదు. అసలు ఎక్కడా వీటికి రివ్యూలు కూడా లేవు.  

అలా అని చిన్న సినిమాలను తక్కువ చేయడం కాదు..  ఆరగదీసిన కథలతో క్వాలిటీ లేని సినిమాలు  తీయడం కంటే మంచి కంటెంట్ ను నమ్ముకుని.. మంచి సినిమాలను తీసి పక్కాగా ప్లాన్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తే ప్రేక్షకుల దృష్టిలో పడతారు.  సినిమా ఫలితం అటూ ఇటూ అయిన  కనీసం ఆ సినిమాలను యూట్యూబ్ లో అయినా ప్రేక్షకులు చూస్తారు కదా.  దాంతోనైనా సినిమాకు పనిచేసిన వాళ్ళకి కాస్తన్నా గుర్తింపు వస్తుంది. అసలు రిలీజ్ అయిన సంగతే ప్రేక్షకులకు తెలియకపోతే ఎలా చూస్తారు?  చిన్న సినిమాల ఫిలిం మేకర్లు ఈ విషయం గురించి గా ఆలోచించాలి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: