ఈ సంవత్సరం టాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్లతో నిర్మించిన సినిమాలు సాహో మరియు సైరా. సాహో సినిమా 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా సైరా నరసింహా రెడ్డి 270 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలైంది. కానీ సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ రాలేదు. వీకెండ్ తరువాత సాహో సినిమా కలెక్షన్లు కూడా భారీగా తగ్గాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాకు ఇప్పటివరకు 82 కోట్ల రుపాయలు కలెక్షన్ల రూపంలో వచ్చాయి. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ కావాలంటే మరో 43 కోట్ల రుపాయలు వసూలు చేయాల్సి ఉంది. కానీ సాహో సినిమా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత షేర్ వసూలు చేస్తుందా అంటే అనుమానమే. హిందీలో మాత్రం సాహో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను ఇవ్వటం విశేషం. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సాహో సినిమా డిజాస్టర్ అయిందని సమాచారం. 
 
సాహో ఫలితం ప్రభావం సైరా సినిమా బిజినెస్ పై పడుతుందని వార్తలు వస్తున్నాయి. దసరాకు విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాపైనే టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. సైరా సినిమా హిట్టైతేనే టాలీవుడ్లో మరిన్ని భారీ చిత్రాలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. సైరా సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి మొదటిసారి చరిత్రకు సంబంధించిన కథతో సినిమా తీస్తున్నాడు. 
 
మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలవుతుందని భావించిన వెంకీమామ చిత్రం రిలీజ్ డేట్ ను అక్టోబర్ 25 కు మార్చుకుంది. దసరాకు సైరా సినిమా మాత్రమే సోలోగా విడుదలుతూ ఉండటంతో హిట్ టాక్ వస్తే చాలు సైరా సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: