టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాణం ఖరీదు మొదలుకుని ఒక్కొక్కటిగా మెల్లగా సినిమాలు చేసుకుంటూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల మదిలోసుప్రీం హీరోగా ఆపై మెగాస్టార్ గా గొప్ప స్థానాన్ని సంపాదించారు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ గారి తరువాత వచ్చిన తరానికి మెగాస్టార్ చిరంజీవి గారు కొన్నేళ్ల పాటు నెంబర్ స్థానంలో కొనసాగారు. అయినప్పటికీ ఆయన సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితోనూ ఎంతో సరదాగా కలిసి మెలిసి మాట్లాడుతూ ఉంటారు. ఇక, తండ్రి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి నటవారసుడిగా చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న మహేష్ బాబు, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా మారి, అనతికాలంలోనే టాలీవుడ్ ప్రిన్స్ గా ఆపై సూపర్ స్టార్ గా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఇక నేటితరం నెంబర్ వన్ హీరోల రేసులో ముందువరుసలో నిలిచే మహేష్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితోనే ఎంతో కలుపుగోలుగా ఉంటూ మంచి పేరు సంపాదించారు. 

ఇక నేడు ఈ ఇద్దరు స్టార్లు ఒకే వేదికపైకి రావడం, అలానే కలిసి ఒకరి గురించి మరొకరు ముచ్చటించడం నిజంగా తెలుగు ప్రజలందరికీ కన్నులపండగే అని చెప్పాలి. తెలుగు సినిమా ప్రొడక్షన్ యూనియన్ సంఘం వారు నిర్వహించిన రథసారథుల రజతోత్సవ వేడుక, నిన్న హైదరాబాద్ లోని గచ్చి బౌలి ఇండోర్ స్టేడియంలో కన్నుల పండుగగా జరిగింది. ఇక ఈ వేడుకకు దాదాపుగా అందరూ సినిమా నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను అహ్వానించడం జరిగింది. అయితే తమకు అవకాశం ఉండి వీలు కుదిరిన తారలందరూ కూడా ఈ వేడుకకు హాజరవడం జరిగింది. కళాబంధు సుబ్బరామి రెడ్డి గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, దర్శకులు బోయపాటి శ్రీను, నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, సి కళ్యాణ్, దిల్ రాజు, నాగబాబు, నిహారిక కొణిదెల, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, అడివి శేష్, ప్రియదర్శి,

మరికొందరు నటులు సహా పలువురు హీరోయిన్లు ఈ వేడుకకు హాజరవడం జరిగింది. అయితే హీరోయిన్ల ప్రత్యేక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ మహేష్ లు కలిసి సరదాగా ఆనందంతో ముచ్చటించిన ఫోటోలు నిన్నటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా షికారు చేస్తున్నాయి. నిజానికి మహేష్ నటించిన టక్కరిదొంగ సినిమాకు అప్పట్లో క్లాప్ కొట్టి ఆ సినిమాను ప్రారంభించిన మెగాస్టార్, ఆ తరువాత పలు సందర్భాల్లో మహేష్ ను కలిశారు. ఆ తరువాత మహేష్ నటించిన నిజం సినిమా శతదినోత్సవ వేడుకలకు మెగాస్టార్ ప్రత్యేక అతిథిగా హాజరయి మహేష్ ను అభినందించడం జరిగింది. అయితే ఇటీవల అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే కలిసిన ఈ ఇద్దరు స్టార్లు, నేడు ఈ ఫంక్షన్ ద్వారా ఆనందంతో సందడి చేయడం పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, త్వరలో వీరిద్దరి కలయికలో ఒక సినిమా వస్తే చూడాలని ఉంది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందనే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: