మనదేశంలో కులం, మతం కంటే ప్రమాదకరమైనవి ఏవీ లేవంటారు. వీటిని చాలా సున్నిత భావాలుగా భావిస్తాం. ప్రజల్లో వెంటనే సెంటిమెంట్లను రేకెత్తించే అంశాలు ఇవి. అందుకే వీటిపై స్పందించాలంటే చాలా మంది జంకుతారు. ఇక సోషల్ మీడియాలో అయితే వీటిపై యుద్ధాలే జరుగుతుంటాయి. ఆ చర్చలకు అంతూ పొంతూ ఉండదు.


సోషల్ మీడియాలో సైతం కొందరు తమ కులం గొప్పదంటే .. తమ కులం గొప్పదంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. మరికొందరు ఆ కులం వాళ్లు దాన్ని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా అలాంటి ఇష్యూనే ఒకటి ఆసక్తి రేపుతోంది. సాక్షాత్తూ లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం ప్రకాశ్ బిర్లాయే కుల వ్యవ‌స్థను ప్రోత్సాహించేలా మాట్లాడ‌టం కలకలం రేపుతోంది.


నాయకులు ఏ కుల సభకు వెళ్తే ..అక్కడ ఆ పాట పాడటం మామూలే.. తాజాగా.. అఖిల బ్రాహ్మణ మ‌హాస‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఓం బిర్లా బ్రాహ్మణ కులాన్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ఓ ట్వీట్ కూడా పెట్టారు. అందులో ఏముందంటే.. స‌మాజంలో బ్రాహ్మణుల‌కు ఉన్నత‌స్థానం ఉంది. ఇది పరశు రాముడి త్యాగం, త‌ప్పస్సు కార‌ణంగా వచ్చింది. అందుకే ఎప్పుడూ బ్రాహ్మణులు స‌మాజంలో మార్గద‌ర్శక‌త్వం వ‌హించే కీల‌క భూమిక‌ను పోషిస్తున్నారు.. అని ఓం బిర్లా ట్వీట్ చేశారు.


బాధ్యాత‌మ‌యుత‌మైన ప‌ద‌విలో ఉండి ఇలా ఎలా కామెంట్ చేస్తారని నెటిజ‌న్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో టాలీవుడ్‌ హీరోయిన్ లావ‌ణ్యా త్రిపాఠి కూడా ఓం బిర్లా తీరును తప్పుబట్టారు. ట్వీట్ ద్వారానే కౌంటర్ ఇచ్చారు. ఆమె ఏం కామెంట్ పెట్టారంటే... " నేను బ్రాహ్మ‌ణ కులానికి చెందిన వ్యక్తిని. అయితే కొంద‌రు బ్రాహ్మణుల‌కు మాత్రం మేం గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో అర్థం కావ‌డం లేదు. నువ్వు చేసే ప‌నులను బట్టే నువ్వు గొప్పవాడివి అవుతావు. కానీ నీ కులం వ‌ల్ల కాదు ” అని ట్వీట్ చేసింది. మళ్లీ ఎందుకొచ్చిన గొడవ అనుకుందో ఏమో.. కొద్దిసేపట్లోనే దాన్ని డెలీట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: