నాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, నిన్న విశాఖపట్నంలో సినిమా యూనిట్ మరియు వేలాదిగా తరలి వచ్చిన అభిమాన సందోహం మధ్య ఎంతో వైభవంగా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెంచేసాయి. అయితే ఆ అంచనాలను తప్పకుండా తమ సినిమా అందుకుని తీరుతుందని అంటోంది గ్యాంగ్ లీడర్ యూనిట్. పెన్సిల్ అనే రచయితగా నాని ఈ సినిమాలో కనపడనున్నారు, 

అలానే ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, నాని సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరణ్య మోహన్, సీనియర్ నటి లక్ష్మి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఒకరకంగా నానికి పెద్ద అగ్ని పరీక్షే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో ఫ్లాప్ లు చవిచూసిన నాని, ఇటీవల వచ్చిన జెర్సీ తో లాభాలు రాబట్టకపోయినా పెట్టుబడి రాబట్టగలిగాడు. ఇక మరోవైపు దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా గతంలో చేసిన హలో సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకోగా, ఈ సినిమాకు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు ఇటీవలి చిత్రలహరి సినిమాతో పర్వాలేదనిపించినా, అంతకముందు వారు నిర్మించిన సవ్యసాచి, 

అమర్ అక్బర్ ఆంథోనీ, డియర్ కామ్రేడ్ సినిమాలతో చాలావరకు నష్టాలు పొందారు. కాబట్టి ఈ విధంగా ఇందరి భవిష్యత్తు ఈ ఒక్క గ్యాంగ్ లీడర్ సినిమా మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఇప్పటికే రూ.28 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, మంచి టాక్ వస్తే మాత్రం, ఆ మొత్తాన్ని ఈజీగా రాబట్టడంతో పాటు మంచి లాభాలు కూడా ఆర్జించే అవకాశం కూడా ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవి కూడా లేకపోవడంతో హిట్ టాక్ వస్తే గ్యాంగ్ లీడర్ అదరగొట్టడం ఖాయంగా కనపడుతోంది. మరి గ్యాంగ్ లీడర్ ఈ అగ్ని పరీక్షని ఎదుర్కొని ఎంతవరకు విజయాన్ని సాధిస్తాడో తెలియాలంటే మరొక్క రెండు రోజులు ఓపికపట్టాల్సిందే......!!


మరింత సమాచారం తెలుసుకోండి: