హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరికొంత స్థలం కేటాయిస్తే 30వేల మంది కార్మికులకు గూడు కల్పించినవారవుతారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థలం కేటాయింపుపై అవసరమైతే ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం అందిస్తామన్నారు. హిందీ సినిమాకు ముంబయి కేంద్రం అయినట్టు.. తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి హైదరాబాదే కేంద్రమని, ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యను పెద్ద మనసుతో పరిష్కరించాలని కోరారు.


మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను కమిటీ ముందుకు తీసుకొచ్చారు. హౌసింగ్ సొసైటీ సభ్యులు కూడా ఇళ్లు కేటాయింపుల్లో తమ ఇబ్బందులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి దృష్టికి తీసుకొచ్చారు.


ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమ కోట్లాది మందికి వినోదం అందిస్తుంది. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇలాంటి పరిశ్రమలో కూడా చాలా సాధకబాధకాలు ఉన్నాయి. మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్రపరిశ్రమ తరలించే పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 4వేల మంది కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం 67.16 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు పరిశ్రమ చాలా పెద్ద దయింది.


దాదాపు 35వేల మంది కార్మికులు పరిశ్రమను నమ్ముకుని ఉన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం సరిపోవడం లేదు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మరికొంత స్థలం కార్మికుల గూడు కోసం కేటాయించాలి. అలాగే చిత్రపురి కాలనీ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి మిగిలి ఉన్న మూడెకరాల స్థలంలో ఇల్లులేని కార్మికుల కోసం వీలైనంత త్వరగా ఇల్లు నిర్మించాలి. శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావుగారు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవారు కావడంతో ఆయన ఆధ్వర్యంలో అందరికి న్యాయం జరుగుతుందని మనస్పూర్తిగా నమ్ముతున్నాను” అన్నారు.





తెలుగు సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ “4వేల మందికి సరిపడ స్థలాన్ని 40 వేల మందికి సర్దడం చాలా కష్టం. తెలంగాణ ప్రభుత్వాన్ని అర్ధించి పక్కనే ఉన్న తొమ్మిదిన్నర ఎకరాల స్థలం ఇవ్వాలని కోరాం. ప్రభుత్వ పెద్దలు కూడా ఆ స్థలాన్ని పరిశీలించి ఇస్తామని హామీ ఇచ్చారు. మా తరఫున శ్రీ పవన్ కల్యాణ్ గారు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే వేలాది మంది పేద కార్మికులకు గూడు కల్పించినవారవుతారు. ఈ సమస్యను శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం మంచిదే. ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. మేము కూడా అందుకే ఆయన్ను కలిసి మా కష్టం చెప్పుకున్నాం. చిత్రపురి కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంకా మూడున్నర ఎకరాల స్థలం మిగిలి ఉంది. దానిలో వీలైనన్ని ఎక్కువ ఇళ్ళు నిర్మించి పేద కార్మికులకు అందజేస్తామ”ని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ శ్రీ వినోద్ బాల, కార్యవర్గ సభ్యులు శ్రీ కాదంబరి కిరణ్ కుమార్, శ్రీ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీ మహానందరెడ్డి, శ్రీ వల్లభనేని అనిల్ కుమార్ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: