టాలీవుడ్ లో మూవీ అసోసియేషన్ (మా)లో ఇప్పటి వరకు ఎన్నో సంచలనాలు తెరపైకి వచ్చాయి.  ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం ‘మా’లో సాగు రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో నరేష్ ప్యానల్, శివాజీరాజా ప్యానల్ మద్య జరిగిన మాటల యుద్దం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈసారి మా ఎన్నికల్లో నటుడు నరేష్ అధ్యక్షపదవి దక్కించుకున్నాడు. నరేష్ ప్యానెల్ తరఫున జీవిత, రాజశేఖర్ లు కీలక పదవుల కోసం పోటీ పడడంతో ఎన్నికల్లో యుద్ధవాతావరణం నెలకొంది.

ఇక నరేష్ అధ్యక్ష పదవి దక్కించుకోగా.. జనరల్‌ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్‌, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్‌ కనకాల, జాయింట్‌ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు. హేమ ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా గెలుపొందారు. అయితే మరోసారి ‘మా’లో గొడవలు మొదలయ్యాయి. ఒకదశలో  'మా' నూతన అధ్యక్షుడిగా నరేశ్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వివిధ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

గతంలో  ప్రమాణ స్వీకారం రోజున నరేశ్‌ మీడియాతో మాట్లాడిన తీరుపై కూడా 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నరేశ్‌ నేను, నేను అని కాకుండా.. మేమంతా అని ప్రస్తావిస్తే బాగుంటుంది' అని నవ్వుతూనే చురకలు అంటించారు. నరేష్ కొంత కాలంగా సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. వరుసపెట్టి అవకాశాలు రావడంతో ‘మా’వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది అందరికీ తెలిసిన నిజం. అందుకే ఆయన మీటింగ్‌లలో పాల్గొనలేకపోతున్నారు. 

తాజాగా మరోసారి ‘మా’ విభేదాలు బయట పడ్డాయి. అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాత నరేష్ తీరు సరిగా లేదని నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ వర్గం నరేశ్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. 'మా' అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది. మరి దీనిపై నరేష్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: