అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. ఈ పాట వినగానే మనకు సింధూరం సినిమా.. సిరివెన్నెల గుర్తుకు వస్తారు.  అప్పట్లో ఈ పాట ఎంత హిట్ అయిందో.. అందరికీ తెలిసిందే.  అంతేకాదు.. ఈ సాంగ్ ఎంతో యువకులకు స్ఫూర్తిగా నిలిచింది అంటే అతిశయోక్తి లేదు.  అలా స్ఫూర్తి చెందిన వ్యక్తుల్లో ఇప్పటి ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఉన్నాడు.  ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.  

చదువుకున్నది సైన్స్ అయినా.. సాహిత్యం అంటే వల్లమాలిన అభిమానం.  ఖాళీ దొరికినప్పుడల్లా సాహిత్య గ్రంధాలను తిరగేసేవాడు.  సినిమాలంటే పిచ్చి.  పాటల రచయిత అవుదామని వచ్చి.. మాటల రచయితగా మారాడు.  కథలు అల్లి చక్కని కథనాలను కూర్చి.. పదునైన మాటలు జొప్పించి.. అందరిచేత మెప్పించిన కోటి రూపాయల పారితోషికం అందుకున్న మాటల రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచాడు. 

ఓర్పుగా ఉండి నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది.  మూసకథలు.. యాక్షన్ కథలతో హోరెత్తిపోతున్న తరుణంలో.. హేమంతంలో వెచ్చని గాలిలా.. గ్రీష్మంలో తొలకరి చినుకులా త్రివిక్రమ్ వచ్చాడు.  కథలో సున్నితమైన భావోద్వేగాలను నింపి.. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే హాస్యాన్ని జోడించి.. ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకుని నిర్మాతల జేబులు నింపి.. దర్శకులకు అవకాశాలు కల్పించిన మాటల మాంత్రికుడు.. నువ్వే నువ్వే తో దర్శకుడిగా మారాడు.  


తొలి చిత్రాన్ని ఎవరైనా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపాలని కోరుకుంటారు.  కానీ, త్రివిక్రమ్ అందుకు భిన్నంగా.. సున్నితమైన భావోద్వేగాలు నిండిన కథను ఎంచుకొని.. మనసుకు హత్తుకునే సన్నివేశాలను సృష్టించి.. ప్రేక్షకులచేత ఔరా అనిపించుకున్నారు.  అంతేకాదండోయ్... ఈ సినిమాలో పాటను రాసి.. తన గళాన్ని కూడా వినించాడు త్రివిక్రమ్. 


త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభకు తార్కాణం అతడు.  మహేష్ బాబును కొత్తగా చూపించి.. ఎవరి ఊహకు అందని స్క్రీన్ ప్లే తో తన మార్క్ మాటలతో మాయచేసి.. ఈ సినిమా తీయడం అతడి వలనే సాధ్యమవుతుంది అనిపించుకున్నాడు.  ఖలేజా సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు.  కానీ, బుల్లితెరపై ఇప్పటికి టాప్ రేటింగ్ లో ఉంటుంది అంటే అర్ధం చేసుకోవచ్చు.  


హిట్ కోసం పరితపిస్తున్న పవన్ కు జల్సాతో జబర్దస్త్ హిట్ ఇచ్చాడు.  జులాయిలో కొత్తరకం స్క్రీన్ ప్లే ను పరిచయం చేశాడు.  సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించే విధంగా ఉంటుంది.  అత్తా సెంటిమెంట్ తో కూడిన కుటుంబ కథా చిత్రం తీసి కథలో  బలం ఉంటె.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించాడు.  అత్తారింటికి దారేది ద్వారా పవన్ కు మరో మంచి హిట్ ను అందించాడు.  ఇది పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.


తండ్రి సెంటిమెంట్ తో సన్నాఫ్ కృష్ణమూర్తి, కుటుంబాల మధ్య వచ్చే చిన్న చిన్న కలతల ఆధారంగా సాగే అ ఆ.. ఇలా అన్ని కూడా త్రివిక్రమ్ ప్రతిభకు నిలువుటద్దంగా నిలిచాయి. ఫ్యాక్షన్ అంటే కత్తులతో నరుక్కోవడం కాదు.. ఆ తరువాత ఆ గ్రామంలో మహిళల ఆవేదనను అర్ధం చేసుకోవాలని చెప్పి, ఫ్యాక్షన్ లో మార్పులు తీసుకొచ్చే అరవిందుడిగా ఎన్టీఆర్ కొత్తగా చూపించి మెప్పించాడు.   మూసపద్ధతి కాకుండా కొత్త పద్దతిని ఎంచుకొని ముందుకు సాగుతున్న త్రివిక్రమ్ కు స్ఫూర్తిగా నిలిచింది మాత్రం సింధూరంలోని 'అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే'.. అజ్ఞానాన్ని పోగొట్టి.. విజ్ఙాన కాంతి రేఖలు నింపే ఆ పాటను మనం కూడా విందాం.  త్రివిక్రమ్ లా ఎదిగేందుకు ప్రయత్నిద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: