అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. చిన్న సినిమాగా విడుదలై రికార్డు స్థాయిలో ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా తెలుగులో ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాల కథల్లో చాలా మార్పు వచ్చింది. తెలుగులో విజయం సాధించిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టాడు.


అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లోనూ ప్రకంపనలు రేపాడు. ఈ సినిమా ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఔరా అనిపించింది. నిజానికి ఈ సినిమా తర్వాత సందీప్ తెలుగులో సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ కబీర్ సింగ్ విజయంతో బాలీవుడ్ నిర్మాతల కళ్ళు అతని మీద పడ్డాయి. హిందీలో సినిమా చేయాలంటూ ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో తన తర్వాతి చిత్రం హిందీలోనే ఉంటుందని ప్రకటించాడు.


ఈ మేరకు సందీప్ ముంబయిలోనే సెటిల్ కూడా అయ్యాడు. అయితే సందీప్ తన తర్వాతి చిత్రం బాలీవుడ్ స్టార్లలో ఒకరైన రణ్ బీర్ కపూర్ తో చేయనున్నాడని సమాచారం. సందీప్ రణ్ బీర్ కి స్టోరీ లైన్ వినిపించాడట. అది అతనికి బాగా నచ్చిందట. దాంతో రణ్ బీర్ ఓకే చెప్పాడని సమాచారం. అయితే ఈ సినిమాకి "డెవిల్" అనే టైటిల్ ని  కూడా ఫిక్స్ చేశారట.ఈ టైటిల్‌ను బట్టే సందీప్ హీరో పాత్రలో మరోసారి నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయని అర్థమవుతోంది.


చిత్ర వర్గాల సమాచారం ప్రకారం రణబీర్‌ది నెగెటివ్ టచ్ ఉన్న పాత్రేనట. మరోసారి సందీప్ తనదైన శైలిలో ఇంటెన్స్ మూవీ తీయడానికే ప్రయత్నించబోతున్నాడట. బాలీవుడ్లో తొలి ప్రయత్నంలో రీమేక్‌తో సత్తా చాటిన సందీప్.. ఈసారి డైరెక్ట్ మూవీతోనే తనేంటో చాటిచెప్పాలనుకుంటున్నాడు. హిందీలో సందీప్ నిర్మాణంలోనూ ఒక సినిమా తెరకెక్కబోతుండటం విశేషం. మరి ఆ రెండు ప్రాజెక్టులు అయ్యాక అయినా సందీప్ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: