మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. 1982లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మా' పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఈ పాటను సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమక్షంలో వీడియో ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గౌరి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...


దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''ముందుగా ఈ పాటక ఇంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణమైన రామానాయుడుగారు, వేటూరి సుందరరామ్మూర్తి, చక్రవర్తిగార్లను తలుచుకుంటున్నాను. ఈ చిత్ర యూనిట్‌ నన్ను ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. ఈ పాట చూస్తుంటే మళ్లీ నాకు ఆరోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ పాట తీసేముందు లొకేషన్స్‌ చూడటానికి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ ఉండ్రాజవరం అనే ఊళ్లో మా ఫ్రెండ్‌ డాబా మీద మడత మంచం మీద పడుకొని ఈ పాట ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఊరంతా ఠంగ్‌ ఠంగ్‌మని సౌండ్స్‌ వస్తున్నాయి. ఏమిటా సౌండ్‌ అని అడగగా.. ఇక్కడ బిందెలు తయారు చేస్తారు అని చెప్పారు. వెంటనే చాలా బిందెలుంటాయా అని అడిగాను. ప్రొడ్యూసర్స్‌ బాగుండాలని బిందెలు కొనేబదులు అద్దెకి ఇస్తారేమో అడుగు.. అన్నాను. వారు ఒప్పుకొని పాట షూట్‌ చేసేటప్పటికి 1000 బిందెలు రెడీ చేసి ఇచ్చారు. ఈ సినిమా రివ్యూ రాస్తూ ఒక విలేకరి 'సినిమా అంతా బావుంది కానీ.. పాట వచ్చేటప్పటికి 1000 బిందెలు ఎట్లా వస్తాయో దర్శకుడికే తెలియాలి' అని రాశారు. తర్వాత నేనతన్ని కలిసినప్పుడు.. నువ్వుగానీ, మీ ఫ్రెండ్స్‌గానీ ఎవర్నైనా లవ్‌ చేశారా అంటే.. చేశారండీ అన్నారు. వాళ్లెప్పుడైనా డ్యూయెట్‌ పాడటం చూశావా? డ్యూయెట్‌ ఒప్పుకుంటే.. బిందెలు కూడా ఒప్పుకోవాలి అన్నాను. పాట అనేది ప్రేక్షకుల కళ్లకి, చెవులకి ఆనందం కలిగించేది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిక్కీ పాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. 'గోపికమ్మా' దగ్గర నుండి నాకు ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. పూజాని చూసినరోజే ఈ అమ్మాయి టాప్‌ హీరోయిన్‌ అవుతుంది అన్నాను. వరుణ్‌ నటన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. 15 ఏళ్ల క్రితం ఈ ప్రొడ్యూసర్స్‌తో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈవిధంగా అవకాశం వచ్చినందుకు హ్యాపీ. 'దేవత' సినిమా 25 వారాలు ఆడినట్టు 'వాల్మీకి' సినిమా కూడా 25 వారాలు ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి'' అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: